Suicide Blast In Pakistan :పాకిస్థాన్లో పండుగ వేళ జరిగిన ఆత్మాహుతి దాడికి 55 మంది బలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద శుక్రవారం ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాదున్ నబీ) సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని మదీనా మసీదు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని సిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మహ్మద్ జావెద్ లెహ్రీ తెలిపారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యాధికారి రషీద్ మహ్మద్ సయీద్ చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జాయ్ స్పందించారు. సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని కెట్టాకు తరలించామని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని విధించామని వెల్లడించారు.