Suella Braverman Letter : బ్రిటన్ మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత సుయెల్లా బ్రేవర్మన్... ప్రధాని రిషి సునాక్‌కు లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ లేఖలో సునాక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బ్రేవర్మన్. అధికారంలోకి వస్తే దేశానికి చేస్తానన్న మేలును.. నెరవేరుస్తానని బ్రిటన్ ప్రజలకు ఇచ్చిన హామీలను సునాక్ మర్చిపోయారని విమర్శించారు. కీలకమైన విధానాల అమలులోనూ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి రిషి సునాక్ అనర్హుడని కూడా ఘాటు ఆరోపణలు చేశారు. సునాక్‌కు ఎవ్వరూ మద్దతు ఇవ్వని సమయంలో.. తాను మద్దతుగా నిలిచానని లేఖలో పేర్కొన్నారు.
'బ్రిటన్‌కు తీవ్రవాద ముప్పు'
సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాటును అందించానని వివరించారు బ్రేవర్మన్. పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించే ర్యాలీలను నిషేధించాలని తాను ఇచ్చిన పిలుపును సునాక్ వ్యతిరేకించారని చెప్పారు. బ్రిటన్ ప్రస్తుతం కీలక దశలో ఉందని.. 20 ఏళ్లుగా ఎన్నడూ చూడని విధంగా తీవ్రవాద ముప్పును ఎదుర్కొంటుందన్నారు. ఈ సమయంలో దేశానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు.
సుయెల్లా బ్రేవర్మన్ ఉద్వాసనకు కారణమిదే!
Britain Home Minister Resigns : గత నెలలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత.. బ్రిటన్‌లో పాలస్తీనా మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే ఈ ర్యాలీల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా కొద్దిరోజుల క్రితం సుయెల్లా బ్రేవర్మన్ విమర్శించారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో లండన్‌లో గత నెలలో జరిగిన భారీ నిరసన ర్యాలీని బ్రేవర్మన్ ఖండించారు. ఆ ర్యాలీని 'విద్వేష కవాతు'గా అభివర్ణించారు.