Sudan Plane Crash Today : సూడాన్‌లో సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం ధ్రువీకరించింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు వెల్లడించింది. మృతుల్లో నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది.
Sudan Air Crash : "సాంకేతిక లోపం కారణంగా పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడింది" అని సూడాన్ ఆర్మీ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపింది.
యుద్ధానికి 100 రోజులు
Sudan Conflict : సూడాన్ సైన్యం, పారా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఏప్రిల్ 15న చెలరేగిన అంతర్యుద్ధం ఆదివారం 100వ రోజుకు చేరుకుంది. ఆదివారం కూడా డార్ఫర్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. రాష్ట్ర రాజధాని న్యాలాలో జరిగిన ఈ ఘటనలో 16 మంది మరణించారు.
వైమానిక దాడిలో 22 మంది
Sudan Air Strike : సూడాన్ నగరంలో జులై 8న జరిగిన వైమానిక దాడిలో 22 మంది మరణించారు. అనేక మంది ప్రజలు గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్‌కు పొరుగున ఉన్న ఓమ్దుర్మాన్లోని నివాస ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
ఊచకోతలో 17 మంది దుర్మరణం
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో జూన్‌లో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా 17 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వైమానికి దాడిలో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి విమానం ద్వారా చేశారా లేక డ్రోన్‌తో చేశారని అనే దానికి స్పష్టత రాలేదు. ఈ మేరకు సూడాన్ ఆరోగ్య శాఖ ఫేస్బుక్లో వెల్లడించిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఈ వైమానిక దాడిని 'ఊచకోత'గా ఆరోగ్య శాఖ అభివర్ణించిందని పేర్కొంది. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారని, కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని ది ఎమర్జెన్సీ రూమ్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ చెప్పినట్లు తెలిపింది.