Earthquake in Taiwan : తైవాన్ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన ఈ భూకంపం వల్ల పలు చోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తైవాన్ ఉత్తర ప్రాంతంలోని తైపీలో భూమి కంపించింది. యూలీలోని ఓ రహదారి పైనున్న వంతెన నేలమట్టమైంది. ఆ సమయంలో బ్రిడ్జ్‌పై వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకోగా రక్షణ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అదే ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒక్కరిని సురక్షితంగా బయటకు తీయగా మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాయున్ పట్టణంలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లోని ఐదవ అంతస్తులో ఉన్న గది సీలింగ్ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ 36 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు.
శనివారం సాయంత్రం నుంచి తైవాన్ ఆగ్నేయ తీరాల్లో సంభవించిన భూకంపాలలో 6.8 తీవ్రతతో నమోదైన భూకంపమే అతి పెద్దదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే ప్రాంతంలో మరోసారి 6.4 తీవ్రత నమోదైంది. చిసాంగ్లోని భూకంప కేంద్రం సుమారు 7 కిలోమీటర్ల లోతులో ఉందని తైవాన్ కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది.