Srilanka Crisis: శ్రీలంక సంక్షోభం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలీ సర్బీ.. 24 గంటలు తిరక్కముందే తన పదవికి రాజీనామా చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారమూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం వల్ల పలువురు చట్టసభ్యులు అధికార కూటమిని వీడారు. దీంతో రాజపక్స సర్కారు మైనార్టీలోకి వెళ్లిందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తమకు పూర్తి మెజార్టీ ఉన్నట్టు చెబుతోంది. తీవ్ర ఆర్థిక పతనాన్ని చవిచూస్తున్న శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పావులు కదుపుతున్నారు. మంత్రుల రాజీనామాల క్రమంలో ఆయన.. అధికార ఎస్‌ఎల్‌పీపీ కూటమిలో కలహాలకు కేంద్ర బిందువుగా ఉన్నారని తన సోదరుడైన బాసిల్ రాజపక్సను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అలీ సర్బీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే, 24 గంటలైనా తిరక్కముందే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
శ్రీలంక సంక్షోభం.. మైనార్టీలోకి రాజపక్స సర్కారు? - srilanka financial minister
Srilanka Crisis: సంక్షోభ శ్రీలంకలో గంటగంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని వ్యవస్థలు కూలిపోతున్నాయి. మంగళవారం కూడా దేశమంతా ఆందోళనలు చేపట్టారు ప్రజలు. ఇక, ఆర్థిక మంత్రి అలీసర్బీ.. బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే రాజీనామా చేశారు. మరికొందరు చట్టసభ్యులు అధికార కూటమికి దూరంగా ఉన్నారు. దీంతో రాజపక్స సర్కారు మైనార్టీలోకి వెళ్లిందని అంతా భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమకు పూర్తి మెజార్టీ ఉన్నట్లు చెబుతోంది.
50 మంది చట్టసభ్యులు వేరు కుంపటి.. దేశ పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. రాజపక్స కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో అధికార కూటమికి చెందిన పలు పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. సుమారు 50 మంది చట్టసభ్యులు కూటమిని వీడి బయటకు వచ్చారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 సీట్లు ఉండగా, అధికారం చేపట్టడానికి కనీసం 113 మంది సభ్యులు అవసరం. 2020 సాధారణ ఎన్నికల్లో ఎస్‌ఎల్‌పీపీ కూటమి 150 స్థానాలు గెలుచుకుంది. అయితే, 41 మంది చట్టసభ్యులు కూటమి నుంచి బయటకు వచ్చారని, దీంతో ప్రధాని మహింద రాజపక్స నేతృత్వంలోని సర్కారు మైనార్టీలో పడిందని చెబుతున్నారు. ప్రభుత్వానికి 138 మంది సభ్యుల మద్దతు ఉందని అధికార కూటమికి చెందిన చట్టసభ్యుడు రోహిత అబేగుణవర్ధన పేర్కొన్నారు. తన ప్రభుత్వ చర్యలను గొటబాయ సమర్థించుకున్నారు. కొవిడ్ కారణంగా పర్యాటకం నిలిచిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రష్యా బొగ్గు దిగుమతులపై ఈయూ నిషేధం