Srilanka Crisis: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు మండుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ-LIOC పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ- సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) సైతం సోమవారం అర్ధరాత్రి రేట్లను పెంచింది. 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను 84 రూపాయల మేర సీపీసీ పెంచింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. శ్రీలంకలో గత ఆరునెలల కాలంలో LIOC ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్ రేట్లను పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్న లంకేయులను తాజా పెంపు మరిన్ని ఇబ్బందులకు గురిచేయనుంది.
రాజ్యాంగ సవరణ:ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించారు శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన జవాబుదారీగా ఉండేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, శాసనంతో కూడిన రాజ్యాంగ సవరణను ప్రధాని ప్రతిపాదిస్తారని ప్రభుత్వ వార్తా సంస్థ డైలీ న్యూస్ తెలిపింది.