తెలంగాణ

telangana

ETV Bharat / international

గొటబాయ రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. 7 రోజుల్లో కొత్త అధ్యక్షుడు

Gotabaya rajapaksa resigns: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను స్పీకర్​ మహింద అభయ్‌వర్ధన్‌ ఆమోదించారు. వారం రోజుల్లోగా తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

gotabaya rajapaksa news
gotabaya rajapaksa news

By

Published : Jul 15, 2022, 11:47 AM IST

Gotabaya rajapaksa resigns: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ ఎట్టకేలకు తన పదవి నుంచి దిగిపోయారు. సింగపూర్‌ నుంచి ఈమెయిల్‌ ద్వారా రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్‌ మహింద అభయ్‌వర్ధన్‌కు పంపించారు. గొటబాయ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

వారం రోజుల్లోగా తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటిదాకా ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్లమెంట్‌ శనివారం సమావేశం కానుందని స్పీకర్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎంపీలంతా పాల్గొనేలా శాంతియుత వాతావరణం కల్పించాలని ఆందోళనకారులను కోరారు.

2.2 కోట్ల జనాభా గల శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గత 7 దశాబ్దాల్లోనే ఎన్నడూ లేని విధంగా నిత్యావసరాలు, అత్యవసరాల కొరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి రాజపక్స కుటుంబమే కారణమని, వారు వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స దిగిపోగా.. రణిల్‌ విక్రమసింఘె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నిరసనలు మిన్నంటడం వల్ల అధ్యక్షుడు గొటబాయ కూడా పదవి నుంచి వైదొలిగేందుకు అంగీకరించారు. అయితే తనను దేశం నుంచి వెళ్లనిస్తేనే రాజీనామా చేస్తానని చెప్పడం గమనార్హం.

అలా ఇటీవల మాల్దీవులు వెళ్లిన గొటబాయ.. అక్కడి నుంచి నిన్న దుబాయి ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్‌ వెళ్లారు. అక్కడి నుంచే తన రాజీనామా లేఖను ఈమెయిల్‌ ద్వారా పంపారు. అయితే ఆయన శ్రీలంక అధ్యక్షుడి హోదాలో ప్రైవేటు పర్యటన నిమిత్తం తమ దేశానికి వచ్చినట్లు తెలిపారని, అందువల్లే అనుమతించామని సింగపూర్‌ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, గొటబాయ రాజీనామాతో ఆందోళనలకారులు కాస్త శాంతించారు. ఏప్రిల్‌ 9 నుంచి వారు తిష్ఠ వేసిన అధ్యక్షుడి నివాసం, ప్రధాని కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:

బ్రిటన్ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తా.. వాటినే నమ్ముతాను: రిషి సునాక్

లంక అధ్యక్షుడు రాజపక్స రాజీనామా.. సింగపూర్​లో మకాం

ABOUT THE AUTHOR

...view details