Sri Lanka social media ban: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీంతో వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం-ఆదివారం మధ్యరాత్రి నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనలను అణచివేయడానికే పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.
Sri Lanka crisis:సంక్షోభ నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ వివిధ ప్రజాసంఘాలు శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. వీటి నియంత్రణకు ఉపక్రమించిన అక్కడి ప్రభుత్వం 36 గంటల అత్యవసర పరిస్థితి విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై కూడా నిషేధం విధించడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ఫ్యూ సైతం అమలు అవుతున్న నేపథ్యంలో కొలంబోలో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు.
Sri Lanka protests: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.