Gotabaya rajapaksa news: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలోనే.. ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్‌తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సైతం ధ్రువీకరించింది. మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది. మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది. ఆయన సోదరుడు, ఆర్థికమంత్రి బసిల్ రాజపక్స సైతం దేశాన్ని విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపాయని బీబీసీ పేర్కొంది. కాగా, గొటబాయ రాజపక్స రాజీనామాపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పార్లమెంట్ స్పీకర్ తెలిపారు. గురువారం నాటికి రాజీనామా అందే అవకాశం ఉందని చెప్పారు.
ఆ వార్తలను ఖండించిన భారత్
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు పారిపోయేందుకు భారత్ సహకరించిందన్న వార్తను అక్కడి భారత హైకమిషన్ ఖండించింది. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. శ్రీలంక సుస్థిర అభివృద్ధికి ఎల్లప్పుడూ భారత సహకారం ఉంటుందని స్పష్టం చేసింది.
అంతకుముందు బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న గొటబాయ రాజపక్స అందుకు ఒకరోజు ముందు మాట మార్చారు. కొత్త షరతును తెరపైకి తీసుకొచ్చారు. తాను, తన కుటుంబ సభ్యులు సురక్షితంగా దేశం వీడి పోయేందుకు అనుమతిస్తేనే పదవి నుంచి వైదొలగుతానన్న హామీకి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. అయితే, ఈ షరతును అంగీకరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీనికన్నా ముందు సోమవారం సాయంత్రం గొటబాయ, ఆయన కుటుంబ సభ్యులు 15 మంది దేశాన్ని వీడేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు సహకరించకపోవడం వల్ల వారి పథకం విఫలమైందని సమాచారం. గొటబాయ తమ్ముడు, శ్రీలంక ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్స కూడా అదే రోజు రాత్రి విదేశాలకు వెళ్లేందుకు విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్ వద్దకు రాగా అధికారులు, ప్రయాణికులు అభ్యంతరం తెలపడం వల్ల వెనక్కు మళ్లారు.
సోమవారం సాయంత్రం కొలంబో విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్ వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. అధ్యక్షుడు గొటబాయ కుటుంబానికి చెందిన 15 పాస్‌పోర్టులను ఆయన అనుయాయులు తీసుకురాగా వాటిని ప్రాసెస్ చేసేందుకు అధికారులు తిరస్కరించారని సైనిక వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది. గొటబాయ, ఆయన కుటుంబ సభ్యులు ఇమ్మిగ్రేషన్ తనిఖీల కోసం ఇతర ప్రయాణికులతో కలిసి వరుసలో నిలబడేందుకు నిరాకరించారు. దీంతో గొటబాయ అనుచరులు తీసుకువచ్చిన పాస్‌పోర్టులను తనిఖీ చేసేందుకు అధికారులు నిరాకరించడంతో పాటు విధులు నిర్వర్తించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ లోగా వారు ప్రయాణించదలచిన విమానం వెళ్లిపోయింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో దుబాయ్ వెళ్లేందుకు అధ్యక్షుడు గొటబాయ సతీమణి లోమా రాజపక్స సీట్లు రిజర్వు చేశారని సమాచారం.
గొటబాయ మా వద్ద లేరు:కొద్ది రోజులుగా ఆచూకీ లేని అధ్యక్షుడు గొటబాయ శ్రీలంక చీఫ్ ఎయిర్ మార్షల్ సుదర్శన పతిరాణాకు చెందిన భవనంలో తలదాచుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని, తమకు చెడ్డ పేరును ఆపాదించేందుకే ఇదంతా చేస్తున్నారని వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది.
స్పీకర్ ప్రకటన నేడు ఉంటుందా?:తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో.. అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 13న వైదొలగుతానని గొటబాయ ఇదివరకే పార్లమెంటు స్పీకర్‌కు, ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలిపారు. ఈ మేరకు స్పీకర్ మహింద అభయ్‌వర్ధనకు రాజీనామా లేఖను కూడా అందించినట్లు సమాచారం. అయితే, గొటబాయ కొత్త షరతు నేపథ్యంలో ఆయన రాజీనామా విషయమై స్పీకర్ ప్రకటన చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.