President Gotabaya Rajapaksa flees: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. గొటబాయ నివాస ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారు. దానికి సంబంధించిన చిత్రాలు అక్కడ మీడియాలో ప్రసారం అయ్యాయి. గత కొద్ది నెలలుగా ఈ ద్వీపదేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
శ్రీలంక నిరసనలు ఉద్ధృతం.. అధ్యక్షుడి నివాసం నుంచి పారిపోయిన రాజపక్స! - శ్రీలంక అధ్యక్షుడు న్యూస్
13:04 July 09
శ్రీలంక నిరసనలు ఉద్ధృతం.. అధ్యక్షుడి నివాసం నుంచి పారిపోయిన రాజపక్స!
అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ.. కొలంబో వీధుల్లో శనివారం నిరసనకారులు భారీ ర్యాలీకి దిగారు. పోలీసులు కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన క్రమంలో ఆందోళన కారులు వీధుల్లోకివచ్చారు. వారంతా శ్రీలంక జెండాలు, హెల్మెట్లు ధరించి అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బారికేడ్లను తోసుకుంటూ గొటబాయ నివాసంలోకి దూసుకెళ్లారని మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. కొలంబోలో నిరసనలు ప్రారంభమవడానికి ముందే రాజపక్స అధ్యక్ష భవనాన్ని వీడినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన్ను ఆర్మీ కేంద్రకార్యాలయానికి తరలించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజా ఘర్షణల్లో 30 మంది గాయపపడ్డారు. వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
ఈ ద్వీప దేశం కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. ఇంధన సంక్షోభం ముదిరింది. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి.