Gotabaya Rajapaksa no confidence: తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శ్రీలంక పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి కారణంగా పేర్కొంటూ గొటబాయ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామం అధ్యక్షుడికి ఉపశమనం కలిగించినట్లయ్యింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘె బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంక పార్లమెంట్ తొలిసారి సమావేశం అయ్యింది.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను వ్యతిరేకిస్తూ తమిళ్ నేషనల్ అలయన్స్(టీఎన్ఏ) ఎంపీ ఎంఏ సుమంథిరన్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ ఎంపీ లక్ష్మన్ కిరియెల్లా కూడా మద్దతు పలికారు. ప్రధానమంత్రి విక్రమసింఘె మాత్రం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సమాచారం. మొత్తంగా ఈ తీర్మానాన్ని 119 మంది ఎంపీలు వ్యతిరేకించగా కేవలం 68 మంది ఎంపీల మద్దతు లభించడంతో అధ్యక్షుడిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది.
ఇక ఇంధన, ఆహార, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలు హింసకు దారితీశాయి. దీంతో ప్రధానమంత్రిగా ఉన్న మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రణిల్ విక్రమసింఘె బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని రక్షించడమే తన కర్తవ్యమన్న ఆయన.. కీలక సంస్కరణలకు నడుం బిగించారు. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునేందుకు శ్రీలంక పార్లమెంట్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమయంలోనే అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది వీగిపోయింది.
డిప్యూటీ స్పీకర్ పదవి రాజపక్సకే!:కాగా, డిప్యూటీ స్పీకర్ పదవి చేజిక్కించుకుని సభలో బలం నిరూపించుకుంది అధికారపక్షం. పార్లమెంట్లో నిర్వహించిన రహస్య బ్యాలెట్ ఓటింగ్లో శ్రీలంక పొడుజన పేరమున పార్టీకి చెందిన అజిత్ రాజపక్స(48) ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. ఓటింగ్లో అజిత్ 109 ఓట్లు దక్కించుకోగా.. ప్రధాన విపక్ష పార్టీ అభ్యర్థి రోహిణి కవిరత్న 78 ఓట్లు సాధించుకున్నారు. పేరులో రాజపక్స ఉన్నప్పటికీ.. అజిత్ రాజపక్స.. అధ్యక్షుడు మహింద రాజపక్స కుటుంబ సభ్యుడు కాదు. అయితే, వీరిద్దరిదీ ఒకే జిల్లా కావడం విశేషం.