Sri Lanka Power Outage Today : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశం శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా చుట్టు ముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాల సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వివరించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కాట్‌మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్ లైనులో సమస్య ఏర్పడడమే సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అవసరమైన చర్యలు ప్రారంభించామని, కొద్ది గంటల్లోనే పూర్తిస్థాయిలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.
ఇప్పటికే రోజులో 10 గంటల విద్యుత్ కోత
గత కొంతకాలంగా శ్రీలంకలో విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. శ్రీలంక ఎక్కువగా జల విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటుంది. బొగ్గు, చమురును తక్కువగా ఉపయోగిస్తారు. అయితే, వేసవి కాలంలో జలశయాల్లో నీరు అడుగంటడం వల్ల బొగ్గుతో విద్యుత్పత్తి చేస్తుంటారు.