Srilanka Crisis: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసన జ్వాలలకు ప్రధానమంత్రి మహీంద రాజపక్స తలొగ్గి.. ఎట్టకేలకు తన పదవి రాజీనామా కూడా చేశారు. అంతకుముందు, కొలంబోలో ప్రధాని మహీంద రాజపక్స నివాసం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడం వల్ల శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల ప్రాణాలు కోల్పోయారు.
రాజపక్స పూర్వీకుల ఇల్లు ధ్వంసం..పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. మాజీ మంత్రి జాన్‌స్టన్ ఫెర్నాండోకు చెందిన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆయనకు చెందిన హోటళ్లకు కూడా నిప్పంటించారు. మాజీ మంత్రి నిమల్ లాన్‌జా ఇంటిపైనా దాడి చేశారు. మొరటువా మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో ఇంటికి నిప్పటించారు. కొలంబోలో అధికార పార్టీ కార్మిక నేత మహింద కహండగామగె ఇంటిపైనా దాడి చేశారు. అలాగే, వలాల్‌వటియా ప్రదేశీయ సభ ఛైర్మన్ ఉడెని అతుకొరాల ఇంటిపైనా నిరసనకారులు దాడి చేశారు. హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల ఇంటిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తగులబెట్టారు. కురునెగలలోని ప్రధాన మంత్రి మహీందా ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. హంబన్‌టోటలోని మెదములానాలో.. మహీందా, గొటబాయ తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన రాజపక్స మెమోరియల్‌ను కూడా ధ్వంసం చేశారు నిరసనకారులు.