Sri Lanka Petrol Crisis: వచ్చే రెండు నెలలు అత్యంత కఠినమైనవని శ్రీలంక ప్రజలను హెచ్చరించారు నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించడమే తన లక్ష్యమని.. ఒక వ్యక్తి, కుటుంబం లేదా సమూహాన్ని కాదని అన్నారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించిన రణిల్.. రాజపక్స కుటుంబం, మాజీ ప్రధాని మహిందను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వచ్చే రెండు నెలలు మన జీవితాల్లో అత్యంత కఠినమైనవి. వాస్తవాలను దాచి ప్రజలకు అబద్ధాలు చెప్పాలని లేదు. వచ్చే రెండు నెలల్లో ఎదురయ్యే ఇబ్బందులను ఓపికతో తట్టుకోక తప్పదు. ఈ తరుణంలో దేశాన్ని కాపాడటమే నా లక్ష్యం. నేను ఇక్కడున్నది ఏ ఒక్క వ్యక్తినో, కుటుంబాన్నో లేదా బృందాన్నో రక్షించడానికి కాదు. దేశంలో పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం ఒక్కరోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దిగుమతులకు చెల్లించడానికి మన దగ్గర సరిపడా డాలర్లు లేవు. అయితే అందుకు అవసరమైన అమెరికా డాలర్లను బహిరంగ మార్కెట్ నుంచి సేకరిస్తాం"
-రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక ప్రధానమంత్రి
రిలీఫ్ బడ్జెట్: ఇక త్వరలోనే 2022 అభివృద్ధి బడ్జెట్ స్థానంలో ఉపశమన బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు రణిల్. భారీ నష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించే ప్రతిపాదనను తీసుకొస్తామని అన్నారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్న ఆయన.. ఎన్నడూ విమానం ఎక్కని వారుకూడా ఆ భారాన్ని మోయాల్సి వస్తుందన్నారు.
ఇదిలా ఉంటే, ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు ఈ సంక్షోభం వెంటాడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైన రాజపక్స కుటుంబం గద్దె దిగాలంటూ దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సూచన మేరకు రణిల్ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షోభ శ్రీలంకను గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి:గొటబాయకు కొత్త ప్రధాని షాక్.. రాజీనామా డిమాండ్‌కు మద్దతు!