తెలంగాణ

telangana

ETV Bharat / international

రాజపక్స కొత్త కేబినెట్.. కుటుంబ సభ్యులు లేకుండానే..

SRI LANKA NEW CABINET: శ్రీలంకలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. 17 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేశారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి మహింద మినహా కుటుంబ సభ్యులకు ఇందులో చోటు ఇవ్వలేదు.

SRI LANKA CABINET
SRI LANKA CABINET

By

Published : Apr 18, 2022, 9:00 PM IST

SRI LANKA NEW CABINET: కుటుంబ పాలనకు వ్యతిరేకంగా లంకేయులు చేస్తున్న పోరుకు గొటబయ ప్రభుత్వం కాస్త దిగివచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను నియమిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేశారు. వీటిలో గొటబయ కుటుంబం నుంచి కేవలం ప్రధానమంత్రి మహింద తప్ప మరెవ్వరికీ చోటు కల్పించలేదు. గొటబయ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Sri Lanka Crisis: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వేల సంఖ్యలో నిరసనకారులు గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గొటబయ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నారు. అయినప్పటికీ తాము రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అధ్యక్షుడు, ప్రధానమంత్రి.. వారు ఇరువురు తప్ప కేబినెట్‌ మొత్తాన్ని రాజీనామా చేయించారు. పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలను కేటినెట్‌లో భాగం కావాలని కోరారు. అందుకు ప్రతిపక్షాలు నిరాకరించాయి. దీంతో తాజాగా 17 మంది మంత్రులతో నూతన కేబినెట్‌కు అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు.

కొత్త కేబినెట్‌లో రాజపక్స కుటుంబీకులను ఈసారి దూరం పెట్టారు. ప్రధానమంత్రి మహింద, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులు. ఈ కుటుంబంలో పెద్దవాడైన చమల్‌ రాజపక్స వ్యవసాయమంత్రిగా మొన్నటి వరకు కొనసాగారు. ఇక మహింద కుమారుడు నమల్‌ రాజపక్స క్రీడల మంత్రిగా చేశారు. వీరి మేనల్లుడు శశీంద్ర కూడా మునుపటి సహాయ మంత్రిగా ఉన్నారు. తాజా కేబినెట్‌లో మాత్రం అధ్యక్షుడు, ప్రధాని మినహా ఆ కుటుంబం నుంచి మిగతావారికి చోటు కల్పించలేదు.

ఇదిలాఉంటే, తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. కరెంటు కోతలు, ఇంధన కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే విదేశీ రుణాలను చెల్లించలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల సాయం కోరుతున్న శ్రీలంక.. ఐఎంఎఫ్‌ నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చదవండి:

'ఆకలి తీరదు.. నిద్ర పట్టదు.. స్నానమూ కష్టమే!'.. చైనా క్వారంటైన్ కేంద్రాల్లో నరకం!!

రష్యా గుప్పిట్లో మరియుపోల్.. ఏడు వారాల తర్వాత కీలక నగరం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details