Sri Lanka economic crisis: కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో రెండు వారాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని శుక్రవారం అర్ధరాత్రినుంచి ప్రభుత్వం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రెండోసారి ఎమర్జెన్సీని ప్రకటించారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో... ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు అధ్యక్ష సచివాలయం తాజాగా ప్రకటన చేసింది.
Sri Lanka lifts emergency: అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పోలీసులు, భద్రత దళాలకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి వారికి అధికారం ఉంటుంది.
40,000 టన్నుల డీజిల్ పంపించిన భారత్...
శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్ మరో 40,000 టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా భారత్ డీజిల్‌ను అందజేసింది. అలాగే బియ్యం, ఔషధాలు, పాలపొడి వంటి అత్యవసర ఉపశమన సామగ్రితో భారత్ (చెన్నై) నుంచి ఓ నౌక కూడా శుక్రవారం బయల్దేరింది. ఇందులో దాదాపు రూ. 45 కోట్ల విలువైన 8,000 టన్నుల బియ్యం, 200 టన్నుల పాలపొడి, ౫టన్నుల ప్రాణాధార ఔషధాలు ఉన్నాయి.