Sri Lanka crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలతోపాటు ఇతర రుణదాతలు ఇచ్చిన రుణాలను ప్రస్తుత సమయంలో తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేసింది. విదేశీ రుణాలను డీఫాల్ట్‌గా ప్రకటించిన శ్రీలంక.. మొత్తం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. విదేశీ మారకనిల్వలు అడుగంటిన నేపథ్యంలో.. అత్యవసర వస్తువుల దిగుమతికి ఈ చర్యలు 'చివరి ప్రయత్నం'గా పేర్కొంది. తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన కొరతతో అల్లాడుతోన్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తాజా చర్యలు చేపట్టామని తెలిపింది.
Sri Lanka loan default: తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక విదేశీ రుణ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. 'రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయం. రుణాలను పునర్నిర్మించడంతోపాటు పూర్తి డీఫాల్ట్‌ను నివారించడమే ప్రస్తుతం తీసుకోగలిగిన ఉత్తమ చర్య' అని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పీ నందాలాల్ వీరసింఘే పేర్కొన్నారు. చిత్తశుద్ధితోనే ఈ చర్యలు తీసుకున్నామన్న ఆయన.. 2.2కోట్ల జనాభా కలిగిన శ్రీలంక గతంలో రుణ చెల్లింపులను ఎన్నడూ ఎగవేయలేదని ఉద్ఘాటించారు.