నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని పేర్కొంటూ ఓ మహిళ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఫిర్యాదు చేసిన మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలోనే మరింత మంది చిన్నారులను కనకుండా ఆయన్ను నిరోధించాలని కోరుతూ డోనర్కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కేసు వేశారు.
ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్‌లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు రూపొందించారు.
"ఆ వైద్యుడు వంద కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చారని ముందే తెలిసి ఉంటే దాతగా అతడిని స్వీకరించేదాన్ని కాదు. వీర్యదానం వల్ల ఎక్కువ మందికి జన్మనివ్వడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిణామాలు తల్చుకుంటేనే నాకు భయం వేస్తోంది. నా బిడ్డ భవిష్యత్ గురించి ఆందోళన మొదలైంది. ఇంకా ఎంత మంది చిన్నారులు నా బిడ్డకు రక్త సంబంధీకులు అవుతారోననే ప్రశ్న తలెత్తింది. నా బిడ్డను రక్షించుకోవడానికి కోర్టుకు వెళ్లడమే మార్గం."
-వైద్యుడిపై కేసు వేసిన మహిళ