తెలంగాణ

telangana

ETV Bharat / international

మెడికల్​ మిరాకిల్​.. 36 ఏళ్ల మహిళకు 7 కణితులు.. 5 క్యాన్సర్లు! - స్పెయిన్​ మహిళకు 12 రకాల క్యాన్సర్లు

స్పెయిన్‌కు చెందిన ఒక మహిళ ఉదంతం వైద్య శాస్త్రాన్ని నివ్వెరపరచింది. జీవితమంతా ఆమెపై కణితులు దాడి చేస్తూనే ఉన్నాయి. 36 ఏళ్లు వచ్చేసరికి 12 రకాల ట్యూమర్లను ఎదుర్కొంది.

woman experiencing 12 different types of tumor
woman experiencing 12 different types of tumor

By

Published : Nov 5, 2022, 9:33 AM IST

స్పెయిన్‌కు చెందిన ఒక మహిళ ఉదంతం వైద్య శాస్త్రాన్ని నివ్వెరపరచింది. జీవితమంతా ఆమెపై కణితులు దాడి చేస్తూనే ఉన్నాయి. 36 ఏళ్లు వచ్చేసరికి 12 రకాల ట్యూమర్లను ఎదుర్కొంది. ఆమె జన్యువులను తరచి చూసిన పరిశోధకులకు మానవుల్లో ఎన్నడూ చూడని మార్పులు కనిపించాయి. ఆమె ఇప్పటికీ ఎలా జీవించి ఉందన్నది వారికి అంతుబట్టడంలేదు.

  • రెండేళ్ల వయసులో ఆమె తొలిసారి క్యాన్సర్‌ బారినపడింది.
  • 15 ఏళ్లు వచ్చేసరికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తలెత్తింది.
  • మరో ఐదేళ్లకు లాలాజల గ్రంథిలో కణితి వచ్చింది. దీంతో ఆ అవయవాన్ని వైద్యులు తొలగించారు.
  • 21 ఏళ్ల ప్రాయంలో డాక్టర్లు మరో శస్త్రచికిత్స చేసి ఆమెలో 'లో గ్రేడ్‌ సార్కోమా'ను తీసివేశారు.
  • తర్వాత కూడా భిన్న రకాల కణితులను ఆమె ఎదుర్కొంది. మొత్తం మీద 12 రకాల ట్యూమర్లు విరుచుకుపడ్డాయి. వీటిలో ఐదు క్యాన్సర్‌ కణితులు ఉన్నాయి.

శోధిస్తే..
బాధితురాలిలో ఇన్ని రకాల ట్యూమర్లు రావడంపై ఆశ్చర్యానికి లోనైన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు.. దానికి మూలాలను గుర్తించాలని నిర్ణయించారు. ఈ బృందానికి స్పెయిన్‌కు చెందిన నేషనల్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు.

  • బాధితురాలి నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. ఆమె కణాల్లోని ఎంఏడీ1ఎల్‌1 అనే జన్యువులో రెండు ప్రతుల్లోనూ ఉత్పరివర్తన కనిపించడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది.
  • ఒక కణం విభజనకు లోనుకావడానికి ముందు అందులోని క్రోమోజోములను క్రమపద్ధతిలో ఉంచడంలో సాయపడే యంత్రాంగ నిర్వహణ బాధ్యతను ఎంఏడీ1ఎల్‌1 చూస్తుంటుంది. కణితులను అణచివేయడంలో దాని పాత్ర ఉండొచ్చని గతంలో భావించారు.

ఒకటి సహజమే..
ఎంఏడీ1ఎల్‌ జన్యువులో ఉత్పరివర్తనాలు కొత్తేమీ కాదు. అయితే ఈ జన్యువుకు సంబంధించిన రెండు ప్రతుల్లో ఒకదానిలోనే ఆ మార్పులు కనిపిస్తుంటాయి. బాధితురాలిలో మాత్రం రెండు ప్రతుల్లోనూ వైరుధ్యం కనిపించింది. మానవుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి. దీనివల్ల బాధితురాలిలో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు తేల్చారు.

లెక్క తప్పుతున్న క్రోమోజోములు..

  • మానవ కణాల్లోని న్యూక్లియస్‌లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఇందులో ఒక జత తండ్రి నుంచి, రెండోది తల్లి నుంచి వస్తాయి.
  • జంట ఉత్పరివర్తనాల వల్ల బాధితురాలిలో కణ ప్రతుల తయారీ ప్రక్రియ దెబ్బతింటోంది. ఫలితంగా భిన్న సంఖ్యల్లో క్రోమోజోములు కలిగిన కణాలు ఉత్పత్తవుతున్నాయి. ఆమె రక్తంలోని 30-40% కణాల్లో అసాధారణ సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయి.

ఇవీ చదవండి :తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా బ్రిటన్‌.. రిషి సునాక్​కు అదో పెద్ద ఛాలెంజ్​!

'నన్ను చంపేందుకు ప్రధాని కుట్ర.. హత్య ప్లాన్ గురించి ముందే తెలుసు'

ABOUT THE AUTHOR

...view details