Elon Musk: గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు సంబంధించి తాజాగా కొత్త వ్యవహారం బయటపడింది. ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో అసభ్యంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి స్పేస్‌ఎక్స్ సెటిల్‌మెంట్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అసత్యాలు అంటూ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే..2016లో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తన సొంత సంస్థలో పనిచేస్తోన్న సహాయకురాలితో ఎలాన్ మస్క్ అసభ్యంగా ప్రవర్తించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం వెల్లడించింది. ఫ్లైట్ ప్రైవేటు రూమ్‌లో బాధితురాలిని అసభ్యకరంగా తాకడంతోపాటు.. నచ్చిన విధంగా మసాజ్ చేస్తే ఓ గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని మస్క్ చెప్పినట్లు వివరించింది. ఈ వివరాలను బాధితురాలి స్నేహితురాలు బహిర్గతం చేసినట్లు ఇన్‌సైడర్ కథనం పేర్కొంది. ఆ సమయంలో మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన బాధితురాలు స్పేస్‌ఎక్స్‌లో తన ఉద్యోగం పోతుందని ముందుగానే ఊహించినట్లు తెలిపింది. ఈ విషయంపై 2018లో ఓ లాయర్‌ను నియమించుకొని న్యాయపరంగా కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తాజా కథనం వెల్లడించింది.
కోర్టు బయటే సెటిల్‌మెంట్..అయితే, ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి 2018లో బాధితురాలికి రెండున్నరల లక్షల డాలర్లు ($2,50,000) చెల్లించి ఈ వ్యవహారాన్ని స్పేస్‌ఎక్స్ సెటిల్ చేసుకుందని తాజా నివేదిక వెల్లడించింది. కోర్టు బయట జరిగిన ఈ సెటిల్‌మెంట్ వ్యవహారానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను బాధితురాలి స్నేహితురాలు చూపించినట్లు ఇన్‌సైడర్ కథనం పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా బాధితురాలితో స్పేస్‌ఎక్స్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు తాజా కథనంలో వివరించింది.