South Africa Mine Accident :దక్షిణాఫ్రికా.. రస్టెన్‌బర్గ్‌లోని ఓ గని వద్ద ఎలివేటర్ కూలిన ఘటనలో 11 మంది కూలీలు మరణించారు. మరో 75 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 200 మీటర్ల ఎత్తు నుంచి ఎలివేటర్ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్లో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కార్మికుల డ్యూటీ నుంచి తిరిగివస్తుండగా జరిగిందీ ప్రమాదం.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ప్లాటినం గనిలో పనిచేసే కార్మికులు ఎలివేటర్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఎలివేటర్ పైనుంచి కిందకి జారిపోయింది. ఈ క్రమంలో 11 మంది మృతి చెందగా.. 75 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం 86 మంది కార్మికులు ఆసమయంలో ఎలివేటర్లో ఉన్నారు.
ఈ దుర్ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా దక్షిణాఫ్రికా ఎనర్జీ అండ్ మైన్స్ మినిస్టర్ గ్విడే మంటాసే ఆదేశించారు. 'ఇంపాలా ప్లాటినం హోల్డింగ్స్ చరిత్రలో ఇది చీకటిరోజు. ప్రమాదానికి కారణాలు ఏంటి? అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం గనిలో పనులు జరగకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశాం.' అని ఇంపాలా ప్లాటినం హోల్డింగ్స్ సీఈఓ నికో ముల్లర్ తెలిపారు.
గోల్డ్మైన్లో అగ్ని ప్రమాదం..
కొన్నాళ్ల క్రితం పెరూలోని ఓ గోల్డ్మైన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 27 మంది కార్మికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నైట్ షిఫ్ట్ పనుల్లో నిమగ్నమై ఉండగా గనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దక్షిణ పెరులోని యానాకిహువా మైనింగ్ కంపెనీకి చెందిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టి.. మొత్తం 175 మంది కార్మికులను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్‌పై క్లిక్చేయండి.