తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒకే కుటుంబంపై కాల్పులు.. ఏడుగురు మహిళలు సహా 10 మంది మృతి - దక్షిణాఫ్రికాలో ఒకే కుటుంబానికి చెందిన 10 మృతి

దక్షిణాఫ్రికాలో ఓ ఇంటిపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. నలుగురు దుండగులు ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

mass shooting in south africa several died
దక్షిణాఫ్రికాలో కాల్పులు 10 మంది మృతి

By

Published : Apr 21, 2023, 6:47 PM IST

Updated : Apr 21, 2023, 8:06 PM IST

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్​లో దారుణం జరిగింది. ఓ ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఓ బాలుడు సహా ఇద్దరు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని పీటర్​మారిట్జ్‌బర్గ్ నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా, చనిపోయిన వారిలో 13, 65 ఏళ్ల వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం.

నలుగురు దుండగులు కాల్పులు జరిపిన అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనుమానితుడు ఒకరు మరణించారు. మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ నిందితుడు గాయపడగా.. మరో నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన నిందితుడు ఇంతకుముందు అనేక కేసుల్లో నేరస్థుడిగా ఉన్నాడని చెప్పారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలను దుండుగులు ఇంకా వివరించలేదు. గతంలో నిందితులు ప్రయాణించిన వాహనానికి సంబంధించిన టాక్సీ డ్రైవర్​ను కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

ప్రపంచంలోనే అత్యధిక నరహత్యలు జరుగుతున్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. కొన్నేళ్లుగా ఇక్కడ సామూహిక కాల్పుల ఘటనలు నిత్యం జరుగుతుండటం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో దక్షిణ కోస్తాలోని గ్కెబెర్హాలో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది సోవెటోలోని జోహన్నెస్‌బర్గ్ టౌన్‌షిప్‌లోని ఒక బార్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 16 మంది కస్టమర్‌లు మరణించారు. అదే రోజు, పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లోని ఒక బార్‌లో 12 మందిపై కాల్పులు జరిపారు కొందరు దుండగులు. ఈ ఘటనలో నలుగురు మరణించారు.

నైజీరియాలో కాల్పులు.. 50 మంది మృతి..!
ఇటీవల ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు జరిపిన రెండు వేర్వేరు కాల్పుల్లో సూమారు 50 మంది మృతిచెందారు. ఉత్తర-మధ్య నైజీరియా బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామం మార్కెట్​ ప్రాంతంలో ఏప్రిల్​ 4న ఈ ఘటన జరిగింది. సాయుధులు జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన మురుసటి రోజే అదే ప్రాంతంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. ఈ దుర్ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఈ రెండు దాడులకు ఏవరూ బాధ్యత వహించలేదు. కాగా, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Apr 21, 2023, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details