Somalia Bomb Attack : ఆఫ్రికా దేశం సొమాలియాలో పాత బాంబు అవశేషాలు పేలడం వల్ల 27 మంది మరణించారని ఓ అంతర్జాతీయ ప్రముఖ వార్థా సంస్థ నివేదించింది. లోయర్ షాబెల్లే ప్రాంతంలోని ఓ ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన ఈ పేలుడులో మృతి చెందిన వారిలో చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనలో 53 మంది గాయపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిందీ పేలుడు.
ఫుట్‌బాల్ గ్రౌండ్లో బాంబు పేలుడు.. 27 మంది మృతి.. చిన్నారులే ఎక్కువ!
21:03 June 10
ఫుట్‌బాల్ గ్రౌండ్లో బాంబు పేలుడు.. 27 మంది మృతి.. చిన్నారులే ఎక్కువ!
తీవ్రవాదుల దాడిలో 9 మంది మృతి..
సోమాలియా రాజధాని మొగాడిషులో జరిగిన తీవ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి గాయాలయ్యాయని.. 84 మందిని రక్షించినట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి.. ఓ హోటల్లోకి చొరబడిన ముష్కరులు కొన్ని గంటలపాటు దాడులు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్-ఖైదా తూర్పు ఆఫ్రికా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. సోమాలియాకు చెందిన.. ఈ తీవ్రవాద సంస్థ.. మొగాడిషులోని హోటళ్లు, ప్రముఖ ప్రదేశాలపై అనేక సార్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది.
తుర్కియేలో పేలుడు.. ఐదుగురు మృతి
Explosion In Factory In Turkey : తుర్కియేలోని అంకారాలో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు మరణించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంకారా వెలుపల 40 కిమీ దూరంలో MKE రాకెట్, పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ వద్ద పేలుడు జరిగిందని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. సదరు ఫ్యాక్టరీ డైనమైట్ విభాగంలో కెమికల్ ప్రయోగం వల్ల పేలుడు సంభవించిందని టెక్నికల్ స్టాఫ్ తెలిపారని అంకారా ప్రావిన్స్ గవర్నర్ చెప్పారు.
ఆయిల్ ట్యాంకర్ పేలి 19 మంది మృతి..
Oil Tanker Explosion Afghanistan : ఇలాంటి ఘటన గతేడాది డిసెంబర్లో అఫ్గనిస్థాన్‌లో జరిగింది. సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు ఇంధన ట్యాంకర్ పేలి దాదాపు 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న సలాగ్ సొరంగ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. ప్రమాదానికి గురైనవారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంత మంది మాత్రం గుర్తుపట్టలేనంతగా గాయపడ్డారు. కాబుల్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఈ సలాగ్ టన్నెల్ ఉంటుంది. ఆ దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలను ఇది కలుపుతుంది. సోవియట్ యూనియన్ సహాయంతో ఈ సొరంగ మార్గాన్ని 1960లో అఫ్గనిస్థాన్ నిర్మించింది.