Solomon Islands Earthquake : సాల్మన్ ద్వీపంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రతను 7గా నిర్ధరించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప సమయంలో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. రాజధాని హోనైరికి ఆగ్నేయంగా దాదాపు 56 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
సాల్మన్ ద్వీపంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ - ఇండోనేసియా జావా ద్వీపంలో భారీ భూకంపం
Solomon Islands Earthquake : సాల్మన్ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7గా నమోదైందని అధికారులు తెలిపారు.
భారీ సముద్ర అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ కేంద్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే భారీ స్థాయిలో ఈ సునామీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ భూకంపం మీటరు ఎత్తు అలలు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు పపువా న్యూగినియా, వనవాటు వంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండొచ్చని పేర్కొన్నారు. సాల్మన్ ద్వీపం 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'లో ఉంది. ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు సముద్రం అడుగున ఉండడంవల్ల.. ఇవి బద్దలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి.
ఇండోనేసియాలోని జావాను సోమవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంప కేంద్రమైన చియాంజుర్ ప్రాంతం తీవ్రంగా ధ్వంసమైంది. ఇప్పటివరకు కనీసం 162 మంది ప్రాణాలు కోల్పోయారని జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని చెప్పారు. ఇండోనేసియాలో చాలా మంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసిన తర్వాత ఇస్లామిక్ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. చనిపోయిన వారిలో ఈ విద్యార్థులే అధికంగా ఉన్నారని గవర్నర్ పేర్కొన్నారు. 13వేలమంది నిరాశ్రయులయ్యారని తెలిపారు.