లోకం తెలియని వయసులో ముక్కూమొహం తెలియని వ్యక్తితో ప్రేమ వలలో చిక్కుకుని ఇల్లు వదిలింది. ప్రేమికుడి ముసుగు తొడిగిన ఆ మోసగాడు ఆమెను అంగట్లో వస్తువులా అమ్మేయడంతో నరక కూపంలోకి అడుగుపెట్టింది. మానవ అక్రమ రవాణా ముఠాకు చిక్కి నాలుగు నెలల్లో వేర్వేరు రాష్ట్రాల్లో మూడు సార్లు అమ్ముడుపోయింది. ఎంతో మంది అకృత్యాలకు బలైంది. తనకన్నా 30 ఏళ్ల పెద్ద వ్యక్తితో తన ప్రమేయం లేకుండానే వివాహం జరిగినా.. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది.
పోలీసులకు దొరికిపోతున్నామన్న భయంతో తనను నిర్బంధించినవారు తీవ్రంగా హింసించి రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్తే.. సీఐడీ అధికారుల సాయంతో అక్కడి నుంచి బయటపడింది. అప్పట్నుంచి ఏడేళ్లపాటు ఆ చేదు జ్ఞాపకాలను మరచిపోవడానికి ప్రయత్నిస్తూనే హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగించింది. ఇప్పుడు 22 ఏళ్ల వయసులో కాలేజీ విద్యార్థిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమైంది.
ఆమె కథ ఇదీ.. బంగాల్‌కు చెందిన బాధితురాలు 15 ఏళ్ల వయసులో ఆన్‌లైన్‌లో రాహుల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. 2015 జనవరిలో అతడ్ని కలవడానికి ఇల్లు విడిచి కోల్‌కతాకు వెళ్లిపోయింది. రాహుల్ ఆమెను బిహార్‌కు వెళ్లే ఓ బస్సు ఎక్కించి, తాను త్వరలోనే వచ్చి కలుస్తానని, తన స్నేహితుడు వచ్చి రిసీవ్ చేసుకుంటాడని చెప్పి పంపించాడు. కానీ రాహుల్ తనను ఆ వ్యక్తికి రూ.1.50 లక్షలకు అమ్మేశాడని ఆ తర్వాతే తెలిసింది. ఆ వ్యక్తి తనను కమల్ అనే మరో వ్యక్తికి అమ్మాడు. కమల్ ఆమెను ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకెళ్లి చిత్ర అనే మహిళకు విక్రయించాడు. బాధితురాలికి చిత్ర తన 45 ఏళ్ల సోదరుడితో బలవంతంగా వివాహం చేసింది. ఓ నెల తర్వాత చిత్ర కుమారుడు కూడా తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.