Cancer Deaths: ప్రపంచ దేశాలను క్యాన్సర్ భూతం వెంటాడుతూనే ఉంది. ఏటా లక్షల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధూమపానం, మద్యం సేవించడం, అధికబరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్ మరణానికి ప్రధాన ముప్పుగా మారినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న క్యాన్సర్ మరణాల్లో దాదాపు సగం ఈ కారణాల వల్లే చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. ప్రపంచంపై వ్యాధులు, గాయాలు, ప్రమాద కారకాల భారం-2019 ఫలితాలపై నిర్వహించిన అధ్యయనం నివేదికను 'ది లాన్సెట్' జర్నల్ ప్రచురించింది.
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల్లో మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను విశ్లేషించేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని గుర్తించారు. వీటివల్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 44.5లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అంటే అన్ని దేశాల్లో చోటుచేసుకుంటున్న క్యాన్సర్ మరణాల్లో దాదాపు 44.4శాతం ఈ మూడు కారణాల వల్లే చనిపోతున్నారని వెల్లడించారు.