ప్రేమ పక్షులకు ఫిబ్రవరి నెల ఒక ఆనంద కోలాహలం అనే చెప్పాలి. ప్రతిక్షణం ప్రేయసికై తపించే వారికి.. కొత్తగా ప్రేమ గూటికి చేరాలనుకునేవారికి వాలంటైన్ వారం ఒక వరమే. ఒక్కరు కాస్త ఇద్దరై.. ఒకరికి ఒకరు తోడై నిలిచేలా చేస్తుంది ఈ ప్రేమ. మరి ఆ వాలంటైన్ వారం వచ్చేసింది. లవర్స్‌లో సందడి తెచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రేమికుల వారం జంటల మధ్య విడదీయరాని బంధాన్ని బలపరుస్తుంది. ప్రేమికులకు ఎంతో ప్రియమైన వాలంటైన్ వీక్‌లో ప్రతిరోజు ఒక కొత్త అనుభూతే. ప్రేమ మనస్సులు దోబూచులాడే ఆ వారం లవర్స్‌కు ఎంతో ప్రత్యేకం. వాలంటైన్స్ డే, హగ్ డే, కిస్ డే, టెడ్డీ డే అని ఇలా రకరకాల కార్యక్రమాలు ఈ వారంలో జరుగుతాయి. ప్రేమికులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుంటూ, తమ భావాలను వ్యక్తపరుచుకుంటూ ఆనంద లోకంలో తేలియాడుతుంటారు. మరి వారం రోజులపాటు జరిగే ప్రేమ పండుగలోని ప్రత్యేకతలేంటో మీకోసం.
ఫిబ్రవరి 7 రోజ్ డే
వాలంటైన్ వారంలో మొదటిరోజు రోజ్ డే. ప్రేమ వారంలో మొదటి రోజును అందమైన గులాబీతో ఆహ్వానిస్తారు. తమకిష్టమైన వారికి గులాబీ పువ్వులతో తమ ప్రేమ సందేశాన్ని పంపుతారు. ఆ వ్యక్తులు తమ జీవితంలో ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ గులాబీల ద్వారా తెలియజేస్తారు. గులాబీలతో ప్రేమ మాధుర్యాన్ని తమ ప్రియసఖికి చెబుతారు. ప్రేమకు చిహ్నంగా ఎర్ర గులాబీలను ఇచ్చుకుంటారు.
ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే
రోజ్ డే తర్వాత ప్రపోజ్ డే. తమ ప్రియ సఖికి చెప్పాలనుకున్న ఎన్నో విషయాలను ఈరోజు వ్యక్తపరుస్తారు. ఎదలోతుల్లో ఏరులై పారుతున్న ప్రేమ ప్రవాహాన్ని గురించి వివరిస్తారు. తమ పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తారు. మనస్సులో ఎగిసిపడుతున్న ప్రేమ జ్వాలను తమ ప్రియమైన వారితో పంచుకుంటారు. తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడానికి ఈరోజును ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందుకే ఈరోజునే చాలా మంది వారికి ఇష్టమైన వారికి తమ ప్రేమ గురించి చెబుతుంటారు.
ఫిబ్రవరి 9 చాక్లెట్ డే
వాలంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. చాక్లెట్లు అంటే అందరికీ ఒకలాంటి ఎమోషన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు కొంచెం ఎక్కువే. ప్రేమికులు ఈ రోజున ఒకరికి ఒకరు చాక్లెట్లను ఇచ్చుకొని తమ ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. కేవలం చాక్లెట్లు కదా అనిపించినా వాటి ద్వారా ప్రేమికులకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. భాగస్వాముల బంధం మరింత బలపడటానికి ఇది మంచి రోజనే చెప్పాలి. చాక్లెట్లు పంచుకొని తమ ప్రేమను వ్యక్తపరిస్తే భాగస్వామి కళ్లలోని ఆనందం ఈ ప్రపంచానికే వెలుగునిచ్చేలా ఉంటుంది.