అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ శివారులోని ఓ మాల్‌లో చొరబడ్డ దుండగుడు అనేక మందిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు సహా 9 మంది మరణించారు. కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ఈ కాల్పుల్లో మాల్ సెక్యూరిటీ గార్డ్ సహా ఎనిమిది మంది మరణించారు. అలెన్లోని విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి మధ్యాహ్నం 3.36 గంటలకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్లు పోలీసులు తెలిపారు. మాల్‌లోకి ప్రవేశించే ముందే దుండగుడు.. పోలీసు అధికారిని కూడా కాల్చి చంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అప్పటికే కాల్పులు జరుపుతున్న అగంతకుడుని కాల్చి చంపారు. ఘటనా స్థలంలో మరొక నిందితుడు కూడా కాల్పులు జరుపుతూ కనిపించాడని.. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో వందలాది మంది పౌరులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో వాళ్లంత భయంతో వణికిపోయారు. ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనను మాటల్లో చెప్పలేని విషాదంగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ అభివర్ణించారు.
కాలిఫోర్నియాలోనూ కాల్పులు.. ఒకరు మృతి
అమెరికా కాలిఫోర్నియాలో మరో కాల్పుల ఘటన జరిగింది. నార్త్ కాలిఫోర్నియాలోని ఓ కాలేజ్ క్యాంపస్ వేడుకలో తుపాకీ పేలింది. ఈ కాల్పుల్లో 17 సంవత్సరాల అమ్మాయి మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు గాయపడినట్లు పోలీసు చీఫ్ అల్డ్జ్రిజ్ తెలిపారు. గాయపడిన వారందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చికిత్స పొందుతూ ఒకరు మరణించగా.. ఇద్దరు యువకులు (21), ఒక అమ్మాయి (17) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరో ఇద్దరు యువకులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.