వందల దేశాల ప్రతినిధులు.. వేల మంది జపాన్ వాసులు.. 18వేల మంది సిబ్బందితో భద్రత.. 11.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.96 కోట్ల 28 లక్షల 74 వేలు) ఖర్చు.. మంగళవారం జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక అంత్యక్రియల హైలైట్స్ ఇవి. జులై 8న నారాలో ఎన్నికల ప్రచార సభలో హత్యకు గురైన అబేకు దాదాపు మూడు నెలల తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది జపాన్ ప్రభుత్వం. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎప్పుడు? ఎక్కడ ? ఎలా?
జులై 8న షింజే అబే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కుటుంబ సభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. జపాన్ ప్రభుత్వం మాత్రం సెప్టెంబరు 27(మంగళవారం) అధికారిక లాంఛనాలతో అబేకు తుది వీడ్కోలు పలకనుంది. రాజధాని టోక్యోలో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా వందల దేశాల నుంచి మొత్తం 4,300 మంది ప్రతినిధులు, వేల మంది జపనీయులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టోక్సో ఒలింపిక్స్ స్థాయిలో ఏకంగా 18వేల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తోంది.
అంత్యక్రియలపై వివాదం ఎందుకు?
Shinzo Abe state funeral controversy : జపాన్లో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి షింజో అబే. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ముమ్మాటికీ సబబు అన్నది ప్రధాని ఫుమియో కిషిద వాదన. అయితే.. ఈ విషయమై జపాన్ వాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇటీవల ఓ సర్వేలో.. ఈ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించడాన్ని మెజార్టీ ప్రజలు తప్పుబట్టారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి.. చర్చి. రెండోది.. ఖర్చు.
చర్చికి, అంత్యక్రియలకు ఏంటి సంబంధం?
యూనిఫికేషన్ చర్చి.. జపాన్లో ఎప్పటి నుంచో వివాదాస్పదం. ఈ చర్చికి, అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ)కి సంబంధం ఉందని షింజో అబే హత్య తర్వాత వెలుగులోకి రావడం విమర్శలకు తావిచ్చింది. చర్చి కారణంగానే తన కుటుంబం తీవ్ర అవస్థలు పడిందని, అందుకే దానితో సంబంధం ఉన్న అబేను చంపానన్నది నిందితుడి వాదన. ఇది జపాన్వ్యాప్తంగా చర్చనీయాంశంకాగా.. అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చర్చితో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని ప్రకటించింది. మరోవైపు.. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఎల్డీపీలోని అబే వర్గీయుల్ని ప్రసన్నం చేసుకోవచ్చన్నది కిషిద ఆశ అనేది విశ్లేషకుల మాట.