Shinzo Abe news: జపాన్ మాజీ ప్రధాని షింజో అబెకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అబె ప్రసంగిస్తున్నప్పుడు ఆయన వెనకనున్న ఖాళీ ప్రదేశంపై భద్రత బలగాలు తగినంత దృష్టి సారించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. నరాలో సభకు వెళ్లాలని కేవలం ఒకరోజు ముందుగా నిర్ణయించడం, ప్రచార వాహనం పైభాగం నుంచి కాకుండా నేలపై నిల్చొని మాజీ ప్రధాని ప్రసంగించడం వల్ల సులభంగా బలైపోయారని వారు విశ్లేషిస్తున్నారు. భద్రత సమస్యలను నరా పోలీసు అధిపతి తొమొయకి ఒనిజుక అంగీకరించారు.
ప్రపంచ నేతల సంతాపం:అబె హత్యకు గురికావడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. ఆయన అందించిన సేవల్ని, తమకున్న అనుబంధాన్ని వివిధ దేశాధినేతలు గుర్తుచేసుకుని సంతాప సందేశాలు వెలువరించారు. అబె భౌతిక కాయాన్ని శనివారం నరా నుంచి టోక్యోకు తీసుకువచ్చారు. పార్థివ దేహాన్ని షిబుయలోని నివాసానికి చేర్చినప్పుడు ప్రజలు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై అధికారులు అబె కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. దిగ్గజ నేతను పొట్టనపెట్టుకున్న జపాన్ నౌకాదళం మాజీ ఉద్యోగి తెత్సుయ యమగామి నివాసంలో భద్రత బలగాలు సోదాలు నిర్వహించినప్పుడు అనేక ఆయుధాలు దొరికాయి. తాను ద్వేషించే ఒక సంస్థతో అబెకు సంబంధం ఉందనీ, అందుకే హత్యకు పన్నాగం రూపొందించానని నిందితుడు విచారణాధికారుల వద్ద వెల్లడించాడు. తల్లిని ఆరాధించే ఒక మతపరమైన బృందమంటే నిందితుడికి ద్వేషమని జపాన్ ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. అబె కంటే ముందు ఆ మత నాయకుడిని హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులకు యమగామి వివరించాడు. రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్నందున అబెను హత్య చేసినట్లు తాను అంగీకరించలేనని అతను తెలిపినట్లు జపాన్ పోలీసులు వెల్లడించారు.
ధమనులు, కాలర్ బోన్స్‌కు గాయాలు:కాల్పుల కారణంగా ఒక తూటా అబె ఎడమ భుజం నుంచి దూసుకుపోయి.. ధమనులను, కాలర్ బోన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని శవపరీక్షలో తేలింది. శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు పోయిందని గుర్తించారు.
గురి తప్పిన తొలి తూటా:ఒక మాజీ ప్రధానికి కల్పించాల్సిన స్థాయి భద్రత అబెకు లేదని క్యోటోకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ఫుమికజు హిగుచి చెప్పారు. నిందితుడు అంత స్వేచ్ఛగా అబె వెనకకు ఎలా రాగలిగాడో దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. యమగామి తొలి విడత కాల్పులు జరిపినప్పుడు తూటా గురి తప్పింది. ఆ శబ్దం విని ఏమైందో చూసేందుకు అబె వెనక్కి తిరిగారు. అప్పుడు రెండో తూటా ఆయన శరీరంలోకి దూసుకువెళ్లింది. మాజీ ప్రధాని భద్రత సిబ్బందిలో ఒకరు తూటారక్షక బ్రీఫ్‌కేసును పైకెత్తినా అప్పటికే నష్టం జరిగిపోయింది. క్షణాల్లో చికిత్స అందించే ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి క్యోటోలో ఒక గిడ్డంగిలో ఫోర్క్‌లిఫ్ట్ ఆపరేటర్‌గా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నాడని, ఎవరితో కలవకుండా మౌనంగా ఉండేవాడని స్థానిక పత్రిక ఒకటి తెలిపింది. గత నెల రోజులుగా రాత్రిపూట రంపం కోత శబ్దం వంటివి అతని ఫ్లాటు నుంచి వినిపించేదని, యమగామిని మాత్రం ఎప్పుడూ కలవలేదని అతని పొరుగు ఫ్లాట్లలో ఉంటున్నవారు చెప్పారు. జపాన్ సురక్షిత దేశమనీ, తన భద్రతను పెంచాల్సిన అవసరం లేదని ప్రధాని హోదాలో అబె 2015లో పార్లమెంటులో చెప్పిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.