Shahbaz Sharif letter: భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పాక్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ పంపారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు.
ఇటీవల పాక్ నూతన ప్రధానికి లేఖ రాసిన ప్రధాని మోదీ, అభినందనలతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్చల కోసం ఉగ్రవాద రహిత వాతావరణాన్ని సృష్టించడం గురించి.. ఈ లేఖలో ప్రధాని ప్రస్తావించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రధాని లేఖకు బదులిచ్చిన పాక్ ప్రధాని తాము కూడా శాంతియుత సహకారాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.
"శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. భారత్‌తో పాకిస్థాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం అనివార్యం. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగం అందరికీ తెలిసిందే. శాంతిని కాపాడుకుందాం. సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదాం"
-షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధానమంత్రి