తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ ప్రధానిగా 'ముక్కుసూటి' షరీఫ్​.. భారత్​తో వైఖరి ఎలా ఉండనుంది?

Shehbaz Sharif: ముక్కుసూటితనం, యథార్థవాది, మనసులో ఏది ఉంటే అదే బయటకు చెప్తారు.. ఇలా ఈ మాటలన్నీ షెహబాజ్ షరీఫ్ సొంతమని పాకిస్థాన్ ప్రజలు ఎక్కువగా చెప్పుకుంటారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షెహబాజ్.. పాక్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు స్వయానా తమ్ముడు. దేశ విభజన తర్వాత లాహోర్‌లో వీరి కుటుంబం స్థిరపడింది. ప్రధాని పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి షెహబాజ్‌ షరీఫ్‌ ఆ పదవికి ఎంపిక కావడం లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకుందామా?

shehbaz sharif
షెహబాజ్‌ షరీఫ్‌

By

Published : Apr 11, 2022, 10:27 AM IST

Pak new PM Shehbaz Sharif: పాకిస్థాన్​ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమే కానుంది. ప్రతిపక్షాల తరఫున ఈయన నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా షెహబాజ్ ఎదిగారు. పంజాబ్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం వల్ల ఈయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. 2017లో ముస్లిం లీగ్ నవాజ్ బాధ్యతలు తీసుకున్న షెహబాజ్.. ఇమ్రాన్ ఖాన్​ ప్రభుత్వంపై పోరాడారు.

  • పాకిస్థాన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న​ షెహబాజ్‌ షరీఫ్‌.
  • షెహబాజ్‌ 1951 సెప్టెంబరు నెలలో లాహోర్​లో జన్మించారు. షెహబాజ్‌ తండ్రి ముహమ్మద్‌ షరీఫ్‌ స్వస్థలం కశ్మీర్‌ (భారత్‌)లోని అనంతనాగ్‌. ఆయన పారిశ్రామికవేత్త. షెహబాజ్​ లాహోర్​లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
  • పాక్​ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్​కు షెహబాజ్‌ షరీఫ్‌ స్వయానా తమ్ముడు.
  • షెహబాజ్​ అయిదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు భార్యలు. మిగతా ముగ్గురికి విడాకులిచ్చారు.
  • షెహబాజ్‌ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ఎన్నికల బరిలో నిలిచారు.
  • బ్రిటన్​లో 1,400 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసు షెహబాజ్​పై ఉంది.
  • 1980లో రాజకీయాల్లో ప్రవేశం. 1988లో మొదటిసారి పంజాబ్​ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నిక. 1997లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు. మూడు సార్లు పంజాబ్ సీఎంగా బాధ్యతలు.
  • 2017లో పాకిస్థాన్ ముస్లిం లీగ్​-నవాజ్​ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు. 2018 సార్వత్రిక ఎన్నికలతో జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారారు.
  • పాక్‌లో సైన్యంతో షెహబాజ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అది ఆయనకు కలిసొచ్చే అంశం.
  • యథార్థవాది. ముక్కుసూటి మనిషి. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ఈ మాటలు పాకిస్థాన్ ప్రజలు షెహబాజ్​ షరీఫ్ గురించి చెప్పుకొనే మాటలు.

దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్‌ కంటే.. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్‌ షరీఫ్‌ హయాంలో భారత్‌ - పాక్‌ సంబంధాలు ఎంతోకొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్‌కు సన్నిహితుడైన పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ నేత సమీవుల్లాఖాన్‌ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్‌ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్‌ సోదరుడైన నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధాని హోదాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.

ఇదీ చదవండి:పాక్​​లో 'రాహుల్ గాంధీ నినాదం'.. ఇమ్రాన్ పార్టీ ర్యాలీలో దుమారం!

ABOUT THE AUTHOR

...view details