china coronavirus cases: కొవిడ్ విజృంభణతో వణికిపోతున్న షాంఘైలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెండున్నర కోట్ల మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం అక్కడి ప్రభుత్వానికి సవాలుగా మారింది. ముఖ్యంగా ఆహారం, నీటితో పాటు ఇతర అత్యవసర వస్తువుల కొరత ఏర్పడడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీంతో భవనాల్లోని బాల్కనీలు, కిటికీల నుంచి అరుపులు, కేకలు, పాటలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం చేస్తున్నారు. వీటితోపాటు పలుచోట్ల సూపర్ మార్కెట్ల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అరుపులు, పాటలతో నిరసనలు:చైనాలో కొవిడ్‌కు కేంద్ర బిందువుగా మారిన షాంఘైలో నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 70వేల కేసులు బయటపడ్డాయి. వైరస్ కట్టడిలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి షాంఘై మహా నగరంలో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత ఐదు రోజులేనన్న అధికారులు.. వైరస్ ఉద్ధృతి తగ్గకపోవడం వల్ల పది రోజులైనా కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తుండడం వల్ల ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యవసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.