బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన జలాంతర్గామిల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోఫీ బ్రూక్ అనే మాజీ నౌకాదళ అధికారి ఇంటర్వ్యూ ఆధారంగా ఓ వార్తాసంస్థ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. లైంగిక వేధింపులు, మహిళా సిబ్బందిపై 'అత్యాచార జాబితా' రూపొందించడం వంటి దుశ్చర్యలను ఆమె వెల్లడించారు. మరికొందరి ఆరోపణలను కథనంలో ఉటంకించారు. దీంతో.. బ్రిటన్ నేవల్ స్టాఫ్ చీఫ్ బెన్ కీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. 'లైంగిక ఆరోపణలు దిగ్భ్రాంతికరం. రాయల్ నేవీలో వీటికి చోటే లేదు. ఇటువంటి వాటిని సహించం. దోషులుగా తేలిన వారెవరైనా.. ర్యాంకుతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు.
బ్రిటన్ రాయల్ నేవీ.. 2011 నుంచి తన సబ్‌మెరైన్ సేవల్లో మహిళా సిబ్బందిని నియమిస్తోంది. ఈ క్రమంలోనే సోఫీ బ్రూక్ సైతం విధుల్లో చేరారు. కొన్నేళ్లకు జలాంతర్గామి కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాలంటూ ఆమెకు ఆదేశాలు అందాయి. కానీ, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు భరించలేక అంతలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించారు. దీంతో నేవీ ఆమెను విధుల్లోంచి తొలగించింది. తదనంతరం ఆమె.. తన ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.