Road accident in pakistan పాకిస్థాన్ లాహోర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు.. లారీ ఢీ కొన్న ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పంజాబ్ రాష్ట్రంలోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు.
రోడ్డుపై వరద నీరు పేరుకుపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. 'చెరుకు గడల లోడుతో వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. చెరుకు గడల లోడు పూర్తిగా బస్సుపై పడిపోయింది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది' అని పోలీసులు వివరించారు. పాకిస్థాన్లో రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, నాసిరకం వాహనాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే ప్రమాదానికి కారణమవుతున్నాయి. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్లోని మొత్తం మరణాల్లో 1.93 శాతం రోడ్డు ప్రమాదాల వల్లనే సంభవిస్తున్నాయి.