పారిస్లో దారుణం జరిగింది. ఓ దుండగుడు గారెడు నార్డ్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తక్షణమే స్పందించి దుండగుడిపై ఛాతీపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. గాయపడిన ప్రయాణికులను, నిందితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం జరిగిందీ ఘటన.
క్షతగాత్రుల్లో ఒక పోలీసు అధికారి ఉన్నట్లు ఫ్రాన్స్ హోంశాఖ మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు. పోలీసులు తక్షణమే స్పందించి దుండగుడిపై కాల్పులు జరపకుంటే ప్రాణనష్టం జరిగేదని ఆయన అన్నారు. దుండగుడు దాడి చేసిన నిమిషం వ్యవధిలోనే అతడిపై పోలీసులు కాల్పులు జరిపారని వెల్లడించారు.
రైల్వే స్టేషన్లో పోలీసులు
గాయపడిన వారిలో కొందరు ప్రయాణికులు, ఒక పోలీసు అధికారి ఉన్నారు. పోలీసు వీపు భాగంలో దుండగుడు కత్తితో పొడిచాడు. అయితే పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రాణాలకు ముప్పు లేదు. దుండగుడిని నిలువరించేందుకు వెంటనే అతడిపై కాల్పులు జరిపిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు. క్షతగాత్రుల్లో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
--గెరాల్డ్ డర్మానిన్, ఫ్రాన్స్ హోం మంత్రి
పారిస్లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో గారెడు నార్డ్ ఒకటి. ఇక్కడ పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తుంటారు. 2015 నుంచి ఇక్కడ అనేకసార్లు దుండగులు దాడులకు పాల్పడుతున్నారు.
రైల్వే స్టేషన్లో పోలీసులు రైల్వే స్టేషన్ బయట పోలీస్ వాహనం