థాయ్‌లాండ్‌లోని పిల్లల డే కేర్ సెంటర్లో ఓ మాజీ పోలీస్ సాగించిన మారణకాండలో 37 మంది మరణించారు. వీరిలో 24 మంది చిన్నారులు ఉన్నారు. కత్తులతోనూ దుండగుడు దాడులు చేశాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉన్మాది కారులో పారిపోతూ కొంతమంది పోలీసులను ఢీకొట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య, కొడుకును సైతం చంపేశాడు. తుపాకీతో విచక్షణారహితంగా దాడి చేసిన అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. చైల్డ్‌కేర్ సెంటర్ అవతల 12 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
నర్సరీ స్కూల్లో మారణకాండ.. 37 మంది బలి.. మృతుల్లో 24 మంది పిల్లలు - థాయ్‌లాండ్ నర్సరీ స్కూల్ షూటింగ్
థాయ్‌లాండ్‌లో ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులు జరిపి 37 మందిని బలిగొన్నాడు. చివరకు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మృతుల్లో అత్యధికులు చిన్నారులేనని అధికారులు తెలిపారు.
థాయ్‌లాండ్‌లోని నోంగ్బువా లంఫూ పట్టణం నడిబొడ్డున ఉన్న పిల్లల డే కేర్ సెంటర్లో గురువారం ఈ ఘటన జరిగింది. తుపాకీతో లోపలకు చొరబడిన ఓ వ్యక్తి.. ఇష్టారీతిన కాల్పులు జరిపాడు. చిన్నారులనే కనికరం కూడా లేకుండా తూటాల వర్షం కురిపించాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే అనేక మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులకు అక్కడకు చేరుకున్నారు. ఉన్మాదిని నిలువరించే ప్రయత్నం చేశారు. వారిపైనా కాల్పులు జరిపాడు ఆ వ్యక్తి. చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలో 24 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పోలీస్ మరణించారని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.