ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముదురుతోందనే సంకేతాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ).. అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ పేదల్లో సగం మందికిపై నివసిస్తున్న.. 54 దేశాలకు తక్షణమే రుణాలు అందకపోతే ప్రజలు మరింత పేదరికంలోకి జారుకొనే ప్రమాదం ఉందని మంగళవారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది.
శ్రీలంక, పాకిస్థాన్, చాద్, ఇథియోపియా, జాంబియాలు రుణ సంక్షోభాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్.. వాషింగ్టన్‌లో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఇదే సమయంలో యూఎన్‌డీపీ హెచ్చరికలు వెలువడ్డాయి. రుణాలను రైటాఫ్ చేయడం, చాలా దేశాలకు ఉపశమనాలు అందించడం, ఆయా దేశాల బాండ్ కాంట్రాక్టులకు ప్రత్యేక క్లాజ్‌లు జోడించడం వంటి చర్యలు ప్రయోజనకరంగా ఉండొచ్చని యూన్డీపీ అడ్మిన్‌స్ట్రేటర్ అచిమ్ స్టెయినర్ తెలిపారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ చేయకపోతే మాత్రం పేదరికం పెరిగిపోవడం ఖాయమని స్టెయినర్ వెల్లడించారు.