సెర్బియాలో పాఠశాలలో కాల్పుల ఘటన మురువక ముందే మరో దారుణం జరిగింది. కదులుతున్న వాహనం నుంచి ఓ వ్యక్తి.. కాల్పులు జరిపాడు. రాజధాని బెల్గ్రేడ్కు 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. ఆటోమేటిక్ వెపన్‌తో కాల్పులు జరిపి వెంటనే 21 ఏళ్ల నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో సెర్బియాలో జరిగిన రెండో సామూహిక కాల్పుల ఘటన ఇది.
పాఠశాలలో కాల్పులు..
బుధవారం.. సెర్బియాలోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా మరొకరు స్కూల్లో గార్డుగా పని చేస్తున్న వ్యక్తి. అదే పాఠశాలలో చదివే ఓ టీనేజీ బాలుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాల్పులు జరిపిన బాలుడు వయసు సుమారు 14 ఏళ్లు. సెంట్రల్ బెల్గ్రేడ్లోని వ్లాదిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తన తండ్రి తుపాకీని తీసుకుని అతడు బడికి వచ్చాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. ఈ మారణ కాండపై సెర్బియా విద్యార్థులు సహా అనేక మంది నలుపు రంగు దుస్తులు ధరించి గురువారం మౌనం పాటించి నివాళులర్పించారు.