తెలంగాణ

telangana

ETV Bharat / international

తుపాకీ సంస్కృతికి చెక్.. అమెరికా చట్టసభ్యుల మధ్య సయోధ్య! - తుపాకీ సంస్కృతి బిల్లు

US Gun violence news: అమెరికాలో తుపాకుల నియంత్రణ దిశగా కీలక ముందడుగు పడింది. తుపాకీ హింస కట్టడిపై డెమొక్రటిక్, రిపబ్లికన్ సెనేటర్లు అవగాహనకు వచ్చారు. ఇందుకోసం కోసం ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి అనుగుణంగా రూపొందించే బిల్లుకు రిపబ్లికన్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

GUN DEAL
GUN DEAL

By

Published : Jun 13, 2022, 9:16 AM IST

US Gun violence news: అమెరికాలో పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతిని అరికట్టాలని ఒత్తిడి పెరుగుతున్న వేళ.. కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్)లోని ఉభయసభల సభ్యుల మధ్య సయోధ్య కుదిరింది. ఈ మేరకు డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సెనేటర్లు తుపాకీ హింస కట్టడి ప్రతిపాదనలపై ఓ అవగాహనకు వచ్చారు. 'కామన్ సెన్స్ ప్రపోజల్' పేరుతో రూపొందించిన ఈ ప్రతిపాదనలకు సెన్స్‌ క్రిస్‌ మర్ఫీ (డెమొక్రాట్), జాన్ కార్నిన్ (రిపబ్లికన్) నేతృత్వంలోని 20 సభ్యుల సెనేటర్ల బృందం అంగీకారం తెలిపింది. ఈ బృందంలో 10 మంది రిపబ్లికన్లు ఉన్నారు.

US gun control bills: మొత్తం 9 ప్రతిపాదనలపై ఉభయ పార్టీల సభ్యులు అంగీకారానికి వచ్చారని 'ది హిల్' వార్తా సంస్థ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా రూపొందించే బిల్లుకు రిపబ్లికన్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం కొత్తగా తుపాకీ కొనుగోలు చేయాలనుకునే వ్యక్తుల పూర్తి సమాచారాన్ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. అక్రమ తుపాకీ కొనుగోళ్లను అడ్డుకోవడం, సమాజానికి ప్రమాదకరంగా పరిణమించే వ్యక్తుల చేతికి ఆయుధాలు వెళ్లకుండా నియంత్రించడం వంటి అంశాలను ఇందులో ప్రధానంగా పేర్కొన్నారు.

తుపాకుల నియంత్రణను రిపబ్లికన్లు ఎన్నో ఏళ్ల నుంచి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు జరగడం గమనార్హం. ఈసారి ప్రవేశపెట్టే బిల్లు సెనేట్​లో 60 ఓట్లతో గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, తాజా ప్రతిపాదనలు అధ్యక్షుడు జో బైడెన్ కోరుకుంటున్న కఠిన చర్యలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు. అయినప్పటికీ.. చట్టసభల్లో ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఇది ముందడుగని స్పష్టం చేస్తున్నారు.

ఉభయ పార్టీల నేతల మధ్య అంగీకారం కుదిరిన నేపథ్యంలో స్పందించిన బైడెన్.. ఈ ఫ్రేమ్​వర్క్​తో అన్ని పనులూ పూర్తి కావని అన్నారు. కానీ, ఇది సరైన దిశలో ముందడుగు అని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​ గడప దాటనున్న అతిముఖ్యమైన గన్ సేఫ్టీ బిల్లు ఇదేనని చెప్పారు. ఇరుపక్షాల మద్దతు కూడగట్టినందున.. ఆలస్యం చేయకుండా ఉభయ సభలు వీటిని ఆమోదించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details