Secondhand Smoking Lancet: ధూమపానం అలవాటు ఉన్నవారి వల్ల పక్కనున్న వారికి ముప్పు ఎక్కువేనని ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక 'లాన్సెట్' అధ్యయనం హెచ్చరించింది. పొగ తాగేవారితో పక్కవారికి కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుందని, ఈ ముప్పు ఇప్పటి అంచనాలను మించి ఉంటుందని పేర్కొంది. సిగరెట్లు, చుట్టలు, హుక్కాలు, పైపుల నుంచి వెలువడే పొగను అక్కడ ఉన్నవారు పీలిస్తే దాన్ని 'సెకండ్ హ్యాండ్' ధూమపానంగా చెబుతుంటారు. ఇళ్లలో కుటుంబ సభ్యులు, వాహనాల్లో తోటి ప్రయాణికులు, పలుచోట్ల సహచరులు, ఇతరులు ఈ తరహా ప్రమాదకరమైన పొగ పీల్చవలసి వస్తోంది. బార్‌లు, రెస్టారెంట్లు, జూదశాలల్లోనూ 'సెకండ్ హ్యాండ్' పొగ బెడద ఎక్కువ.
క్యాన్సర్ ముప్పు పొంచి ఉండటానికి ధూమపానం, మద్యపానం, బీఎంఐ ఎక్కువగా ఉండటం మూడు ప్రధాన కారణాలు. తదుపరి కారకాల్లో అరక్షిత శృంగారం, పరగడుపున రక్తంలో చక్కెరస్థాయి బాగా ఎక్కువగా ఉండటం, వాయు కాలుష్యం, ధూళి, తగినంతగా పాలను, ముతక ధాన్యాలను తీసుకోకపోవడం, సెకండ్ హ్యాండ్ ధూమపానం ఉన్నాయి. ఈ లెక్కన క్యాన్సర్ కారకాల్లో సెకండ్ హ్యాండ్ ధూమపానానిది పదో స్థానం. ఈ 10 కారణాల వల్ల 2019లో 37 లక్షల క్యాన్సర్ మరణాలు సంభవించాయి. సిగరెట్ పొగలో 7,000 రసాయనాలుంటే, వాటిలో వందలాదిగా విషతుల్యమైనవి ఉన్నాయి. అందులో 70 శాతం క్యాన్సర్ కారకాలేనని పరిశోధకులు తెలిపారు. 1964 నుంచి సెకండ్ హ్యాండ్ ధూమపానం వల్ల 25 లక్షల మంది మృతిచెందినట్లు అంచనా.