Spelling Bee Competition 2023 : అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన విద్యార్థి సత్తా చాటాడు. 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత మూలాలున్న 14 ఏళ్ల దేవ్ షా విజేతగా నిలిచాడు. సామ్మోఫైల్(psammophile) అనే పదాన్ని తప్పులు లేకుండా చెప్పి దేవ్ విజయాన్ని సాధించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న దేవ్.. అమెరికా ఫ్లోరిడాలోని లార్గోలో నివాసముంటున్నాడు. గతంలో కూడా దేవ్ స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ సారి మాత్రం పోటీల్లో విజేతగా నిలిచి 50 వేల యూఎస్ డాలర్లు బహుమతిగా పొందాడు.
'నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా కాళ్లు ఇంకా వనుకుతునే ఉన్నాయి. ఈ విజయం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ పోటీల్లో పాల్గొనడానికి పరీక్షలు ముగిశాక బాగా ప్రాక్టీస్ చేశా. చదువుల్లోనూ రాణించాలనుకుంటున్నా. ఇక ఫైనల్స్‌లో నేను పోటీలో ఉన్నట్లుగా భావించలేదు. రౌండ్స్ మధ్యలో మేము ఒకరినొకరు పలకరించుకుంటూ పాల్గొన్నాము. ఈ పోటీలో విజయం సాధించటం సంతోషంగా ఉంది' అంటూ దేవ్ షా ట్రోఫీని పైకెత్తి స్టేజ్‌పై తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
దేవ్ తనను తాను ప్రోత్సహించుకుంటూ ఉండేవాడని విద్యార్థి కోచ్ స్కాట్ రిమెర్ చెప్పుకొచ్చారు. 'నేను దేవ్‌కు మూడేళ్లుగా శిక్షణ ఇస్తున్నాను. దేవ్‌లోని పట్టుదల, సాధించాలన్న కసి, నన్ను ఆకట్టుకునేవి. అంతేకాదు అతడు సెల్ఫ్ మోటివేటెడ్ కుర్రాడు. రెండు ప్రయత్నాల తర్వాత (2019, 2021) దేవ్.. ఈ పోటీల్లో గెలవటం సంతోషంగా ఉంది' అని రిమెర్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవ్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.