SCO Summit 2023 : ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి షాంఘై సహకార సంస్థ- ఎస్సీఓ దేశాలు ఏ మాత్రం వెనకాడకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ వైఖరి ఉండకూడదని పేర్కొన్నారు.సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించడానికి సంకోచించకూడదని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఎస్సీఓ దేశాల నేతలతో అన్నారు.
"ఆఫ్గనిస్థాన్‌లోని పరిస్థితి మనందరి (ఎస్సీఓ దేశాల) భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఆఫ్గనిస్తాన్‌కు సంబంధించి భారతదేశం ఆందోళనలు, అంచనాలు చాలా ఎస్సీఓ సభ్య దేశాల మాదిరిగానే ఉన్నాయి. భారత్, అఫ్గాన్ మధ్య చాలా కాలంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఆ దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేశాం. 2021 ఘటన నుంచి కూడా అఫ్గాన్‌కు మావనీయ సహాయాన్ని అందిస్తున్నాము. పొరుగు దేశాలలో అశాంతిని వ్యాప్తి చేయడానికి లేదా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఆఫ్గనిస్థాన్‌ను ఎవరూ ఉపయోగించకుండా చూడాలి."
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
Narendra Modi SCO Summit : వర్చువల్ విధానంలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు- ఎస్సీఓ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు వింటుండగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని.. దాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను కూడా ప్రధాని ఎస్సీఓ సమావేశంలో ప్రస్తావించారు. ఇరాన్ కొత్త సభ్యుడిగా ఎస్సీఓ కుటుంబంలో చేరబోతున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపిన ప్రధాని.. బెలారస్ ఎస్సీఓ సభ్యత్వం కోసం మెమోరాండం ఆఫ్ ఆబ్లిగేషన్‌పై సంతకం చేయడాన్ని కూడా స్వాగతించారు. ఆఫ్గనిస్థాన్‌లోని పరిస్థితి ఎస్సీఓ దేశాల భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందన్నారు. తీవ్రవాద భావజాలాన్ని ఎవరూ ప్రోత్సహించకుండా చూడాలని సూచించారు ప్రధాని చెప్పారు.