తెలంగాణ

telangana

ETV Bharat / international

భూమిని ఢీకొట్టనున్న 50 ఏళ్ల నాటి వ్యోమనౌక! - cosmos 482 spacecraft colliedes earth

cosmos 482 spacecraft colliedes earth: సోవియట్​ యూనియన్​ ప్రయోగించిన 50 ఏళ్ల నాటి ఒక వ్యోమనౌక భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గమ్యస్థానానికి చేరడంలో విఫలమైన ఈ స్పేస్​క్రాఫ్ట్​ 3-4 ఏళ్లలో భూమిపై పడే అవకాశం ఉందని లెక్కలు కడుతున్నారు.

cosmos 482 descent craft 607
cosmos 482 descent craft 607

By

Published : May 31, 2022, 7:20 AM IST

cosmos 482 spacecraft colliedes earth: శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం 50 ఏళ్ల కిందట సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన ఒక వ్యోమనౌక ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. గమ్యస్థానానికి చేరడంలో విఫలమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ఇప్పుడు భూమి దిశగా వస్తోంది. 3- 4 ఏళ్లలో ఇది పుడమిని ఢీ కొట్టొచ్చని శాస్త్రవేత్తలు లెక్కలు కడుతున్నారు.

ఏమిటీ వ్యోమనౌక?:1972 మార్చి 27న సోవియట్‌ యూనియన్‌.. శుక్ర గ్రహంపై పరిశోధనలకు వెనీరా-8 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. దీనికి జతగా అదే నెల 31న మరో స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపింది. దీన్ని 'కాస్మోస్‌ 482'గా పిలుస్తున్నారు. 117 రోజుల ప్రయాణం అనంతరం వెనీరా-8 విజయవంతంగా శుక్ర గ్రహంపై కాలుమోపి, కొంత డేటాను భూమికి పంపింది. ప్రతికూల వాతావరణం కారణంగా 63 నిమిషాల పాటే అది పనిచేసింది. 'కాస్మోస్‌ 482' మాత్రం భూ కక్ష్యను దాటలేక చతికిలపడింది. నాటి నుంచి పుడమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. మొదట్లో 9,802 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉండేది. తర్వాత క్రమంగా కిందకి దిగుతోంది.

'సమయం' కలిసిరాక..:కాస్మోస్‌ 482ను మోల్నియా అనే రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ఈ రాకెట్‌.. వ్యోమనౌకను భూకక్ష్య దాటించి, శుక్ర గ్రహం వైపు వెళ్లేందుకు వీలుగా హీలియోసెంట్రిక్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సింది. మోల్నియాలోని ఎగువ దశ ఇంజిన్‌ అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల వ్యోమనౌక భూ కక్ష్యలోనే చిక్కుకుపోయింది. రాకెట్‌ ఇంజిన్‌ ఎంతసేపు పనిచేయాలో నిర్దేశించే టైమర్‌ను తప్పుగా సెట్‌ చేయడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

రెండు భాగాలు:కక్ష్యలోకి చేరాక కాస్మోస్‌ 482 రెండుగా విడిపోయింది. మెయిన్‌ బస్‌ భాగం 1981లోనే భూ వాతావరణంలోకి ప్రవేశించగా.. శుక్రుడి ఉపరితలంపై దిగడానికి ఉద్దేశించిన డిసెంట్‌ క్రాఫ్ట్‌ మాత్రం ఇంకా కక్ష్యలోనే ఉంది.

.

ఏం జరుగుతోంది?:గత 50 ఏళ్లలో డిసెంట్‌ క్రాఫ్ట్‌ 7,700 కిలోమీటర్ల మేర కిందకి దిగింది. ఈ నెల 1 నాటికి 1957 కిలోమీటర్ల కక్ష్యలో చేరింది. ఇది తుది ప్రయాణ మార్గంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇది భూమిని ఢీ కొడుతుందని పేర్కొంటున్నారు.

ఎప్పుడు?:నాసాకు సంబంధించిన జనరల్‌ మిషన్‌ అనాలసిస్‌ టూల్‌ (జీమ్యాట్‌)తో లెక్కలు కట్టిన మ్యాక్రో ల్యాంగ్‌బ్రోక్‌ అనే శాస్త్రవేత్త.. 2024-2027 మధ్య 'కాస్మోస్‌ 482' భూ వాతావరణంలోకి ప్రవేశించొచ్చని పేర్కొన్నారు. రష్యా ఖగోళశాస్త్రవేత్త పావెల్‌ షుబిన్‌ మాత్రం 2023-2025 మధ్య ఇది జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

భూవాతావరణ రాపిడిని తట్టుకుంటుందా?:వెనీరా శ్రేణి వ్యోమనౌక మొత్తం బరువు 1,180 కిలోలు. అందులో డిసెంట్‌ క్రాఫ్ట్‌ బరువు 495 కిలోలు. సాధారణంగా ఉపగ్రహాలు, వ్యోమనౌకల్లోని భాగాలు.. కక్ష్య నుంచి భూమి దిశగా దూసుకొచ్చేటప్పుడు వాతావరణ రాపిడికి గురవుతాయి. ఫలితంగా తీవ్రస్థాయిలో వేడెక్కి మండిపోతాయి. కొన్ని శకలాలే ఈ ప్రక్రియను తట్టుకొని నేల లేదా సముద్రంలో పడుతుంటాయి.

  • దట్టమైన శుక్రుడి వాతావరణ పొరలను తట్టుకొనేలా కాస్మోస్‌ 482 రూపొందింది. అంతకన్నా తక్కువ సాంద్రత కలిగిన భూ వాతావరణ పొరల్లో తలెత్తే రాపిడిని ఇది సునాయాసంగా తట్టుకుంటుంది. అందువల్ల వ్యోమనౌక మొత్తం పుడమిని తాకే అవకాశం ఉంది.
  • శుక్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొట్టకుండా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ మృదువుగా దిగేందుకు వీలుగా డిసెంట్‌ క్రాఫ్ట్‌లో పారాచూట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 50 ఏళ్ల తర్వాత అది ఇప్పుడు పనిచేయడం అనుమానమే. అందువల్ల అది పుడమిని బలంగానే తాకొచ్చు.

ఎక్కడ?: 'కాస్మోస్‌ 482' వ్యోమనౌక.. భూమిపై 52 డిగ్రీల ఉత్తర, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతంలో పడుతుందని అంచనా. అందులో ఐరోపా, ఆసియా, అమెరికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఇది సముద్రంలోనే పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి:ఉక్రెయిన్​ యుద్ధం వల్ల ఆఫ్రికాలో ఆకలి కేకలు

ABOUT THE AUTHOR

...view details