తెలంగాణ

telangana

ETV Bharat / international

హజ్ యాత్రలో విషాదం.. మక్కాకు వెళ్తుండగా బస్సులో మంటలు.. 20 మంది మృతి

హజ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ అయి ఓ వంతెనను ఢీకొట్టింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

bus accident in saudi arabia today
saudi arabia road accident news today

By

Published : Mar 28, 2023, 8:14 AM IST

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయి ఓ బస్సు.. వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 29 మందికి గాయాలైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. నైరుతి రాష్ట్రమైన యాసిర్​లో ఈ ఘటన జరిగింది. యెమెన్ సరిహద్దులో ఈ రాష్ట్రం ఉంది. బస్సు ప్రమాదానికి గురికాగానే బోల్తా పడిందని సౌదీ మీడియా వెల్లడించింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయని తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారని అల్ ఎఖ్​బరియా అనే టీవీ ఛానెల్ వెల్లడించింది. బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్లు ఆ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఘటన జరిగిందని అల్ ఎఖ్​బరియా టీవీ వెల్లడించింది. అదుపుతప్పి వంతెనను బస్సు ఢీకొట్టిందని పేర్కొంది.

బస్సులోని ప్రయాణికులంతా హజ్ యాత్రికులేనని తెలుస్తోంది. వీరంతా మక్కాకు వెళ్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఘటన గురించి తెలియగానే స్థానియ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకొన్న సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. రెడ్ క్రెసెంట్ వంటి ఎమర్జెన్సీ సేవల సంస్థలు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

రంజాన్ మాసం తొలి వారంలోనే ఈ ఘటన జరగిన నేపథ్యంలో స్థానికంగా విషాదం నెలకొంది. రంజాన్ నెలలో అక్కడి ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేసేందుకు ఇష్టపడుతుంటారు.

కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి
దక్షిణ ఈక్వెడార్​లో ప్రకృతి ప్రకోపానికి 16 మంది బలయ్యారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దక్షిణ ఈక్వెడార్​లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ముప్పు పెరిగింది. ఈ క్రమంలోనే కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు దక్షిణ ఈక్వెడార్ రవాణా శాఖ మంత్రి డారియో హెర్రెరా తెలిపారు. కొండ చరియలు ఇంకా విరిగిపడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details