Shehbaz Sharif headphones : రష్యా అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీలో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ హెడ్‌ఫోన్స్‌తో ఇబ్బంది పడడం సోషల్ మీడియాలో సెటైర్ల వరదకు కారణమైంది. "పాకిస్థాన్ పరువు తీస్తున్నారు" అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కొందరు సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
పాపం పాక్ ప్రధాని.. హెడ్‌ఫోన్స్‌తో తంటా.. మీమర్స్‌కు పంట - పాక్ ప్రధానిపై ట్రోల్స్
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రధానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ సందర్భంగా హెడ్‌ఫోన్స్ పెట్టుకునేందుకు షెహ్బాజ్ షరీఫ్ నానా తంటాలు పడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.
షాంఘై సహకార సంస్థ సదస్సు కోసం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ వెళ్లారు షరీఫ్. అదే సదస్సుకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ సమయంలో పుతిన్ చెప్పే మాటల అనువాదం వినేందుకు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నారు షరీఫ్. అయితే అవి జారి కింద పడిపోయాయి. పక్కనున్న వ్యక్తి సాయం తీసుకున్నా మళ్లీ అలానే జరిగింది. పాక్ ప్రధాని ఇబ్బందులు చూసి ముసిముసి నవ్వులు నవ్వారు పుతిన్. ఈ వీడియోను రష్యా అధికార మీడియా సంస్థ ఆర్ఐఏ షేర్ చేయగా.. పాక్‌లోని ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యూజర్లు షరీఫ్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
వేర్వేరు దేశాల ప్రతినిధులతో షరీఫ్ భేటీలకు సంబంధించిన ఫొటోలను అస్త్రంగా చేసుకుని అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు పాకిస్థాన్‌లోని ప్రతిపక్ష పీటీఐ పార్టీ నేత ఖాసిం ఖాన్ సూరి. ఓ ఫొటోలో విదేశీ ప్రతినిధులంతా ఏదో రాసుకుంటుంటే.. పాక్ బృందంలోని వారంతా ఖాళీగా కూర్చోవడాన్ని తప్పుబట్టారు. వారిని యాచకులుగా అభివర్ణించారు.