Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యా శతఘ్నులు తూట్లు పొడుస్తున్నాయి. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రెమ్లిన్ ముఖ్యంగా సివీరోదొనెట్స్క్ ప్రాంతంపై దృష్టిపెట్టింది. తాజాగా గత 24 గంటల్లో మాక్సర్ సంస్థ సమీకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. శతఘ్ని గుండ్ల వర్షానికి ధ్వంసమైపోయిన భవనాలు, తూట్లు పడిన పొలాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
సివీరోదొనెట్స్క్ ప్రాంతం పూర్తిగా పారిశ్రామిక నగరం. ఈ నగరాన్ని దక్కించుకొంటే దొనెట్స్క్‌లో కీలక నగరమైన క్రమటోర్క్స్‌కు చేరుకోవడానికి రష్యాకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే 70శాతం సివీరోదొనెట్స్క్ రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈ నగరానికి 20 నిమిషాల ప్రయాణ దూరంలోని రుబిజ్నే కూడా రష్యా శతఘ్నుల దెబ్బకు ధ్వంసమవుతోంది. మరోపక్క రష్యా మల్టిపుల్ రాకెట్ లాంఛర్లను కూడా ఈ దాడలుకు వాడుతోంది. సివీరోదొనెట్స్క్‌లోని మైదాన ప్రాంతాల్లో ఈ లాంఛర్లను రష్యా మోహరించినట్లు తెలుస్తోంది.