తెలంగాణ

telangana

ETV Bharat / international

‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత - సాల్మొనెలోసిస్ వ్యాధి

Salmonella Bacteria: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్​లో 'సాల్మొనెల్లా బ్యాక్టీరియా' బయటపడింది. బారీ కాలెబాట్‌ గ్రూప్‌ నిర్వహణలో బెల్జియంలో ఉన్న కంపెనీ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. లిక్విడ్ చాక్లెట్‌ను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారంలో.. తదుపరి నోటీసు వెలువడే వరకు తయారీని నిలిపేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఓ వార్తాసంస్థకు తెలిపారు.

Salmonella
Salmonella

By

Published : Jul 1, 2022, 1:48 AM IST

Salmonella Bacteria: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్‌ ఫ్యాక్టరీలో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’ కలకలం రేగింది. బారీ కాలెబాట్‌ గ్రూప్‌ నిర్వహణలో బెల్జియంలోని వైజ్‌ పట్టణంలో ఉన్న కంపెనీ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. లిక్విడ్ చాక్లెట్‌ను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారంలో.. తదుపరి నోటీసు వెలువడే వరకు తయారీని నిలిపేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. మరోవైపు.. ఇక్కడ తయారు చేసిన అన్ని ఉత్పత్తులను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. దక్షిణ బెల్జియం ఆర్లోన్‌లోని ఫెర్రెరో ఫ్యాక్టరీలో ఇదే తరహా సాల్మొనెల్లా కేసు బయటపడిన వారాల వ్యవధిలోనే ఇది వెలుగుచూడటం గమనార్హం.

ఈ ప్లాంట్‌.. 70కిపైగా కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. వాటిలో హెర్షే, మోండెలెజ్, నెస్లే తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఇక్కడి నుంచి లిక్విడ్‌ చాక్లెట్‌ డెలివరీ తీసుకున్న సంస్థలను కంపెనీ సంప్రదిస్తోంది. జూన్ 25 నుంచి ఆ చాక్లెట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను రవాణా చేయొద్దని కోరింది. వాస్తవానికి, చాలావరకు ఉత్పత్తులు పరిశ్రమలోనే ఉన్నాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. బెల్జియం ఆహార భద్రత ఏజెన్సీ ‘ఏఎఫ్‌ఎస్‌సీఏ’ సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది.

ఇదిలా ఉండగా.. లిక్విడ్‌ చాక్లెట్‌ ఉత్పత్తి రంగంలో ‘బారీ కాలెబాట్‌’.. ప్రపంచ నంబర్ వన్ సంస్థ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ టన్నుల ఉత్పత్తులు విక్రయించింది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా ఉత్పత్తి కేంద్రాలు, 13 వేలకుపైగా ఉద్యోగులున్నారు. ఇదిలా ఉండగా.. సాల్మొనెల్లా రకం బ్యాక్టీరియాతో ‘సాల్మొనెలోసిస్’ వ్యాధి ప్రబలుతుంది. ఇది సోకినవారిలో అతిసారం, జ్వరం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. 'సాల్మొనెల్లా టైఫీ' రకం బ్యాక్టీరియాతో టైఫాయిడ్‌ బారిన పడే ప్రమాదం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details