దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు. ఆయనకు ఇదివరకు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం దాన్ని తొలగించారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడగలుగుతున్నారని న్యూయార్క్‌లోని చౌతాకా ఇన్స్టిట్యూషన్ అధ్యక్షుడు మైఖెల్ హిల్ తెలిపారు. చౌతాకా సంస్థలో ప్రసంగించేందుకు వెళ్లిన సమయంలోనే రష్దీపై దాడి జరిగింది. ఓ దుండగుడు రష్దీపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన అతడికి గంటల పాటు చికిత్స కొనసాగింది. ఓ సర్జరీ సైతం నిర్వహించారు వైద్యులు. కత్తి పోట్ల వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతిందని శనివారం రష్దీ ఏజెంట్ న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించారు. ఓ కన్ను కోల్పోయే ప్రమాదం సైతం ఉందని తెలిపారు.
దీర్ఘకాలంగా మృత్యునీడలో రష్దీ
బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ చాలాకాలం నుంచి మృత్యునీడలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక బహుమతి వరించగానే ఆయన పేరు అంతర్జాతీయ సాహిత్య రంగంలో మార్మోగిపోయింది. ఇరాన్ అధినాయకుడు అయతుల్లా ఖొమైనీ జారీ చేసిన ఫత్వా వల్ల మృత్యువు వెన్నాడటంతో ఆయన దీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిరూపంగా నిలిచినందున రష్దీ కొందరికి ఆరాధ్యనీయుడిగా, మరికొందరికి సైతానుగా కనిపించారు.
1947 జూన్ 19న బొంబాయి (ముంబయి)లో ఒక కశ్మీరీ ముస్లిం కుటుంబంలో అహ్మద్ సల్మాన్ రష్దీ జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే రష్దీని తల్లిదండ్రులు విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్ పంపారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తరవాత రష్దీ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. క్రమంగా ఇస్లాం మత విశ్వాసాలకు దూరం జరిగారు. రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే నటుడిగా, వాణిజ్య ప్రకటనల రచయితగా పనిచేశారు. రష్దీ మొదటి నవల ‘గ్రైమస్’ గొప్ప విజయం సాధించకపోయినా, విమర్శకులు ఆయనలో ప్రతిభను గుర్తించారు. ఆయన రెండో నవల మిడ్‌నైట్స్ చిల్డ్రన్ 1981లో ప్రతిష్ఠాత్మక బుకర్ బహుమతిని సాధించిపెట్టింది. సర్వత్రా ప్రశంసలు పొందిన ఆ పుస్తకం 5 లక్షల ప్రతులు అమ్ముడుపోయింది.