Salman Rushdie News: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి వెనుక ఇరాన్ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసింది. ఈ వ్యవహారంపై తొలిసారి అధికారికంగా స్పందించిన ఇరాన్.. ఈ దాడి విషయంలో తమపై ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. రష్దీ, ఆయన మద్దతుదారులే దానికి కారణమని టెహ్రాన్‌లోని విదేశాంగశాఖ సోమవారం పేర్కొంది. 1988లో రష్దీ నవల 'ది సాతానిక్ వెర్సెస్' తీవ్ర వివాదాలకు దారితీసింది. ఆయన్ను చంపేయాలంటూ అప్పట్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా రుహొల్లా ఖొమేనీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దాడి వెనుక ఇరాన్ హస్తంపై ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి నాసర్ కనాని మాట్లాడుతూ.. సల్మాన్ రష్దీపై దాడి విషయంలో ఆయన, ఆయన మద్దతుదారులను తప్ప మరెవరినీ నిందించబోమని అన్నారు. ఈ విషయంలో ఇరాన్‌పై ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆయన తన రచనల్లో ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను 'వాక్ స్వాతంత్ర్యం' సమర్థించదని అన్నారు. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీయం ద్వారా ఆయన ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తుచేశారు. ఆయనపై దాడికి పాల్పడిన అనుమానితుడి గురించి మీడియాలో వచ్చిన సమాచారం తప్ప తమకు వేరే ఇతర సమాచారం లేదని తెలిపారు.